సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ ఇంకా విడుదల కానప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ప్రవేశాల కోసం ఇప్పట్నుంచే హడావుడి చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సెట్‌తో పనిలేకుండానే సీట్లు ఇస్తామంటున్నాయి. అనుబంధ గుర్తింపుతో నడిచే కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్ల భర్తీపై దృష్టి పెడుతున్నాయి. టాప్–10 కాలేజీలు మినహా అన్ని కాలేజీలూ ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష మేలో జరుగుతుంది. మే నెలాఖరులో ఫలితాలు వెలువడతాయి. సాధారణంగా ఆగస్టులో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అనుమతినిస్తారు. ప్రైవేటు కాలేజీలు మాత్రం ఈ షెడ్యూల్‌కు విరుద్ధంగా అనధికార అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి.
విద్యార్థుల జాబితా సేకరణ
ప్రతి ఇంటర్ కాలేజీ నుంచి సెకండియర్ విద్యార్థుల వివరాలను ఆయా ఇంజనీరింగ్ కాలేజీల తరఫున కన్సల్టెన్సీలు, పీఆర్వోలు సేకరిస్తున్నారు. అంతర్గతంగా జరిగే పరీక్షల్లో వారి మార్కులను పరిశీలిస్తున్నారు. జేఈఈ, ఇంజనీరింగ్ కోచింగ్ కోసం నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విద్యార్థులను కేటగిరీలుగా విభజిస్తున్నారు. టాప్ ర్యాంకులు వస్తాయనుకునే విద్యార్థులను మినహాయించి ద్వితీయశ్రేణి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కోరుకున్న బ్రాంచీలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. డీమ్డ్, అటానమస్ కాలేజీలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. ఇంజనీరింగ్ ఫైనలియర్‌లో క్యాంపస్ నియామకాలు ఉంటాయని.. ఉద్యోగం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నాయి. కొన్ని సంస్థలతో ఉపాధికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామంటున్నాయి.
రంగంలోకి కన్సల్టెన్సీలు
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, కన్సల్టెన్సీ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపుతూ ముందే సీటు బుక్ చేసుకోవాలని కోరుతున్నాయి. కాలేజీల్లో చేరుస్తామని చెప్పే వారి నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటున్నాయి. మరికొందరి నుంచి సమ్మతి పత్రాలపై సంతకాలు పెట్టించుకుంటున్నాయి. సెట్‌కు ముందు చేరే విద్యార్థులకు రాయితీలతోపాటు కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు ఇస్తామని హామీ ఇస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థలకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు భారీ కమీషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులను తమ వైపు తిప్పుకోవడంపై కొన్ని కాలేజీలు పీఆర్వోలకు ఏకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గతేడాది ప్రభుత్వానికి నివేదిక పంపగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పట్నుంచే కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.


