రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో సినీ, వినోద రంగాల అభివృద్ధి అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ‘గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. విద్యార్థిగా సమ్మిట్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పని చేయాలి. కొత్త ఫిల్మ్ సిటీ రావడంతో సినిమా పరిశ్రమను మరింత అభివృద్ది చెందుతుంది’ అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ‘ గ్లోబల్ సమ్మిట్ పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సయిటెడ్ గా ఉంది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు అవసరం. పానెల్ చర్చల ద్వారా నేను మరింత నేర్చుకునే అవకాశం దక్కింది.సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు’ అన్నారు.
బాలీవుడ్ నటుడు, నిర్మాత రితేష్ దేశముఖ్ మాట్లాడుతూ.. నాకు మొదట సినిమాలో అవకాశం ఇచ్చింది తెలుగు నిర్మాతలు.హైదరాబాద్ పెట్టుబడులకు మంచి స్థానం. ప్రశాతంగా ఉన్న దగ్గరికే పెట్టుబడులు వస్తాయి.ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ మంచి ప్లేస్’ అన్నారు. సదస్సులో ‘తెలంగాణలో సినీ ప్రపంచం’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చొరవ, ప్రణాళికలు, లక్ష్యాలను ప్రదర్శించింది.


