ప్యానల్ డిస్కషన్‌లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, వివిధ సంస్థల ప్రతినిధులు
గృహ వసతికి పీపీపీ ప్రాజెక్టులు రావాలి
‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’పై చర్చలో నిపుణుల సూచన
సమగ్ర విధానాన్ని తయారు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్/బిజినెస్ బ్యూరో: ‘హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. కానీ ఇవన్నీ, ధనికులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్నవే. లగ్జరీ ఇళ్ల నిర్మాణం దాదాపు శాచురేషన్‌కు చేరుకుంది. అల్పాదాయం ఉన్న వర్గాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ వర్గాలకు ఇళ్లు పొందటం కష్టంగా ఉంది.
బడా నిర్మాణ సంస్థలు ఆ వర్గాలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేలా పీపీపీ ప్రాజెక్టులు రావాల్సి ఉంది’ చవక ధరల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిపుణులు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సూచన ఇది.గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్–తెలంగాణ మోడల్ 2047’అంశంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది.
సీబీఆర్‌ఈ దక్షిణాసియా ప్రతినిధి ప్రీతం మెహ్రా సంధానకర్తగా వ్యవహరించగా, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతం, వాసుదేవన్ సురేష్ (హడ్కో మాజీ సీఎండీ), అభిజిత్ శంకర్ రే (వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి), డాక్టర్ పీఎస్‌ఎన్ రావు (ఎస్‌పీఏ ఢిల్లీ), జి.రామ్‌రెడ్డి (క్రెడాయ్ అ«ధ్యక్షుడు), ఎం.నంద కిషోర్ (రాంకీ ఎండీ), అజితేష్ (ఏఎస్‌బీఎల్ ఫౌండర్) పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్‌ఐజీ కేటగిరీలో 20.33 లక్షల ఇళ్లు, ఎంఐజీ కేటగిరీలో 8.77 లక్షల ఇళ్ల అవసరం ఉందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతం తెలిపారు.
ప్రత్యేక నమూనా దిశగా: పొంగులేటి
‘రాష్ట్రంలో గృహాల డిమాండ్– సరఫరా మధ్య భారీ అంతరం ఉంది. దీన్ని తగ్గించేందుకు వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, పట్టణ ప్రాంతాల అవసరాలపై దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన గృహ నిర్మాణ తెలంగాణ నమూనా–2047 వైపు అడుగులేస్తున్నాం. ఈ నమూనా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా ఉంటుంది. పీపీపీ విధానంలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య పేదల కోసం భారీ కాలనీలను నిర్మించే యోచనలో ఉన్నాం.
మురికివాడల పునరాభివృద్ధి, గ్రీన్‌ఫీల్డ్ శాటిలైట్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల కాలనీలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లతో అనుసంధానిస్తూ అద్దె/కార్మికుల కాలనీల నిర్మాణం ప్రధాన వ్యూహాలుగా నమూనాను రూపొందించాం’అని మంత్రి పొంగులేటి చెప్పారు.
అందుబాటులో ధరల్లో గృహాలు లభించాలంటే పన్ను రాయితీల్లాంటివి సరిపోవని, మరింత అనువైన వ్యవస్థ కావాలని రామ్‌కీ ఎస్టేట్స్ ఎండీ నందకిషోర్ తెలిపారు. ఇళ్లు, స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రెంటల్ హౌసింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ ఇండియా ఎండీ మోహిత్ అరోరా చెప్పారు.


