‘గ్లోబల్‌’ అట్రాక్షన్‌ | Govt making very ambitious arrangements for Telangana Rising Global Summit 2025 | Sakshi
Sakshi News home page

‘గ్లోబల్‌’ అట్రాక్షన్‌

Dec 7 2025 5:24 AM | Updated on Dec 7 2025 5:24 AM

Govt making very ambitious arrangements for Telangana Rising Global Summit 2025

వేదిక ప్రాంగణం..

సమ్మిట్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం 

చార్మినార్, సచివాలయం వద్ద 3డీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌

హుస్సేన్‌సాగర్‌లో స్పెషల్‌గా వాటర్‌థీమ్‌

ఎయిర్‌పోర్టు నుంచి వేదిక దాకా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌.. సమ్మిట్‌ వేదికకు 50 మీటర్ల ఇంటరాక్టివ్‌ టన్నెల్‌

హైదరాబాద్‌ వ్యాప్తంగా రంగురంగుల 1,500 జెండాలతో డిస్‌ప్లే

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధు లను ఆకట్టుకునేలా హైదరాబాద్‌ను అందంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పా ట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓ వైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్స్‌ మేళవింపుతో మరోవైపు జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహ దారులు, సమ్మిట్‌ వేదిక.. ఇలా అన్ని చోట్లా హైటెక్‌ ప్రొజె క్షన్లు, డిజిటల్‌ రూపంలో ప్రదర్శ నలు, ఆధునిక విజువల్‌ ఎఫెక్ట్‌లతో ప్రత్యేకంగా పెట్టుబడుల 
పండుగ వాతావరణంలా కనిపిస్తోంది.

చార్మినార్‌తోపాటు కాచిగూడ రైల్వేస్టేషన్‌ భవనంపై ప్రత్యేక లైటింగ్‌ ప్రొజెక్షన్‌ ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవం చూపించనున్నారు. 

 సచివాలయం వద్ద అద్భుతమైన త్రీడీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌తో రాష్ట్ర అభివృద్ధి తీరు, భవిష్యత్‌ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించడానికి ప్రణాళిక రూపొందించారు. రైజింగ్‌ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్‌ప్లేలు ఉంటాయి. 
 దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్‌ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ లోగోను ఇన్‌లిట్‌ టెక్ని క్‌తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు. 

హుస్సేన్‌సాగర్‌లో వాటర్‌ ప్రొజెక్షన్‌ ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ, మహిళా సాధికారత, యువత–రైతు ప్రధాన కార్యక్రమాలు, మూడు ట్రిలియన్‌ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు.
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సమ్మిట్‌ వేదిక వరకు వెళ్లే అప్రోచ్‌ రోడ్డుపై భారీ డిజిటల్‌ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ల మీద ఫ్యూచర్‌ సిటీకి ఎలా చేరుకోవాలి..ఎంత దూరం వంటి వివరాలు పొందుపరుస్తారు. 

నగరవ్యాప్తంగా గ్లోబల్‌ సమ్మిట్‌ లోగోతో తయారు చేయించిన 1,500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని చాటనున్నారు. 
సమ్మిట్‌ వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గం మొత్తం ఆధునిక త్రీడీ ఎనీమార్ఫిక్‌ డిజైన్లు రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్‌ టన్నెల్‌ను ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే రూపంలో ఏర్పాటు చేసి, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్‌ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో పది వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్‌ సమ్మిట్‌కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్‌ సిటీ ప్రణాళిక, డిజిటల్‌ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్‌ బ్రోచర్లు అందుబాటులో ఉంచుతారు. అక్కడున్న వలంటీర్లు ప్రజలకు సమ్మిట్‌ డైలీ షెడ్యూల్‌ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement