సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు.
వేదిక పై ఒక్కో రంగం నుంచి ఒక్కరు ఉన్నారు. నన్ను వేదికపై ఉంచడం సినిమా పరిశ్రమ కు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం. నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా. సీఎం రేవంత్‌రెడ్డి ‘బ్రెయిన్ చైల్డ్’ చూడాలని సమిట్‌కు వచ్చా. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మొదట్లోనే హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేయాలని ఆయన మాతో అన్నారు. చెప్పినట్లుగానే.. సీఎం ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ సమిట్ చూసిన తర్వాత.. సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది. వినోద రంగం పరంగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తామని నమ్మకంగా చెప్పారు. మా సలహాలతో ముందుకు వెళ్తాం అన్నారు. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను వినోదం వైపు మల్లించాలి. చదువే ప్రమాణికం కాదు , డిగ్రీ లేని వారు కూడా జాతీయ స్థాయి సినిమా లు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా... ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు.


