‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ఏర్పాట్లు క్లైమాక్స్‌కు
మినీ టౌన్‌షిప్‌ను తలపిస్తున్న సదస్సు ప్రాంగణం
నేడు ఉదయం 11 గంటల లోపు ‘డ్రై రన్’నిర్వహణకు సన్నాహాలు
70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఎనిమిది జోన్లుగా విభజన
రెండు ప్రధాన, ఆరు అనుబంధ సమావేశ మందిరాల నిర్మాణం.. 500 మంది అతిథులు, 1,500 మంది ప్రతినిధుల కోసం ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ –2025 సమావేశ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబవు తోంది. సోమవారం నుంచి సదస్సు ప్రారంభమవుతుండటంతో ఆదివా రం ఉదయం 11 గంటలలోపు ఏర్పాట్లు పూర్తి చేసి ‘డ్రై రన్’ నిర్వహించేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతు న్నారు.
సదస్సు జరిగే ప్రాంతాన్ని ఎనిమిది జోన్లుగా విభజించి పలువురు ఉన్నతాధికారులకు సకాలంలో ఏర్పాట్లు పూర్తయ్యేలా సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి అతిథులు, ప్రతినిధులు కలుపుకొని రెండు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న గవర్నర్, సీఎం, మంత్రులు సేద తీరేందుకు ప్రధాన సమావేశ మందిరం వెనుక భాగంలో సకల వసతులతో కూడిన తాత్కాలిక హాళ్లను నిర్మించారు. భద్రతా ఏర్పాట్లకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
సమావేశ ప్రాంగణాల ఏర్పాటు ఇలా..
భారత్ ఫ్యూచర్ సిటీలోని 70 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని గ్లోబల్ సమ్మి ట్‌కు ఎంపిక చేసి ఏర్పాట్లు చేస్తు న్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో సమా వేశ నిర్వహణలో అత్యంత కీలకమైన రెండు సువిశాల సమావేశ మందిరాలు నిర్మించారు. వీటి చుట్టూ వృత్తాకారంలో మరో ఆరు అనుబంధ సమావేశ మందిరాలు తాత్కాలికంగా నిర్మించారు. ఈ అనుబంధ సమావేశ మందిరాలను అతిథులు, ప్రతినిధు లకు భోజన వసతులు, చర్చాగోష్టిల కోసం కేటాయించారు. ప్రధాన సమావేశ మందిరంలో రెండు వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. దానికి అనుబంధంగా ఉన్న మరో ప్రధాన సమావేశ మందిరంలో జరిగే ఎగ్జిబిషన్‌లో 25 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి.
సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం
తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న సమావేశ మందిరాలు, ఇతర నిర్మాణాలు మినీ టౌన్‌షిప్‌ను తలపిస్తున్నాయి. సమావేశ మందిరాల చుట్టూ గ్లోబల్ సమ్మిట్ లోగోతోపాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా నీలి రంగు తెరలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. రామప్ప ఆలయం, కాకతీయ కళాతోరణం, హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ, చార్మినార్ వంటి చారిత్రక చిహ్నాలను ఈ తెరలపై ముద్రించారు. సమావేశ ప్రాంగణం చుట్టూ టైల్స్‌తో తాత్కా లిక దారులు నిర్మించడంతో పాటు ముఖద్వారం వద్ద విశాలమైన పచ్చిక బయళ్లు, పూల మొక్కలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సమావేశ ప్రాంగణం ముఖ ద్వారాన్ని (కంకోర్స్) అత్యాధునికంగా తీర్చిదిద్దడంతోపాటు ఎల్‌ఈడీ టన్నెల్ ద్వారా అతిథులు కొత్త అనుభూతితో సమావేశ మందిరా లకు చేరుకునేలా తీర్చిదిద్దుతు న్నారు. సదస్సు జరిగే సోమ, మంగళవారాల్లో సాయంత్రం 7 గంట లకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సమావేశ మందిరాల వెనుక భాగంలో ప్రత్యేక వేదికను కూడా డిజిటల్ తెరలతో నిర్మించారు.
ఏర్పాట్లలో 2వేల మంది తలమునకలు
సదస్సు ప్రారంభానికి కేవలం కొద్ది గంటలు మాత్రమే ఉండటంతో సకాలంలో పనులు పూర్తి చేసేందుకు సుమారు రెండు వేల మంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జ్‌గా, వారి పరిధిలో నోడల్ ఆఫీసర్లకు సమన్వయం, పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. భోజన సదుపాయాల బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ హోటల్‌కు అప్పగించారు.
సదస్సు బందోబస్తు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసుల కోసం మాంకాల్ సమీపంలోని ఓ భారీ కన్వెన్షన్ సెంటర్‌లో వసతి కల్పించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు, అతిథ్య సేవలు అందించడంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా అధికారులకు పని విభజన చేయడంతో పాటు రెండు వేల మంది కార్మికులు, సిబ్బందిని వినియోగిస్తున్నాం’అని టీజీఐఐసీ ఎండీ శశాంక ‘సాక్షి’కి వెల్లడించారు.


