గ్లోబల్ సమ్మిట్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌ను ఆహ్వానిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు
రేపు మధ్యాహ్నం గవర్నర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
తొలిరోజు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు సహా ప్రముఖుల ప్రసంగాలు
వివిధ శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్టులు.. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు
విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మొహమ్మద్ అజహరుద్దీన్‌తో కలిసి శనివారం ప్రజాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సమ్మిట్ కార్యక్రమాల వివ రాలను వెల్లడించారు. ఈ నెల 8న మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.
సమ్మిట్‌లో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారని.. తొలిరోజు నోబెల్ పురస్కార గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాశ్ సత్యార్థి, డైరెక్టర్ ఆఫ్ ట్రంప్–మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, మంత్రి శ్రీధర్‌బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలతోపాటు డిప్యూటీ సీఎంగా తాను ప్రసంగిస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు కీలకోపన్యా సం చేస్తారని వివరించారు. తొలిరోజు ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం 3–4 గంటల మధ్య పలు శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్టులు జరుగుతాయని భట్టి తెలి పారు.
సమ్మిట్ రెండో రోజున ఉదయం 9 గంటలకు చర్చా గోష్టులు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్య సాధనలో భాగంగా చేపట్ట నున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతో రూపొందించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047ను అదే రోజున ఆవిష్క రిస్తామన్నారు. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్య క్రమం జరుగుతుందన్నారు. ముగింపు కార్య క్రమంలో పాల్గొనే ప్రముఖుల వివరాలను తరువాత తెలియజేస్తామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తు న్నామన్నారు.
ముఖ్యులకు అవసరమైతే ప్రత్యేక విమానాలు..
ఈ సమ్మిట్ రాజకీయ కార్యక్రమం కాదని.. పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్వహిస్తున్న సదస్సు అని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరి స్థాయిలో వారు సదస్సును విజయవంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆదివారంలోగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్య మైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమాన సదుపాయం కల్పిస్తామన్నారు. సదస్సులో చేసుకున్న ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడుల వివరాలను చివరి రోజు వెల్లడిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
గవర్నర్‌ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం లోక్‌భవన్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు ఆహ్వానించారు.


