ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి అధికారులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ జరగనున్న ప్రాంగణాన్ని శనివారం సాయంత్రం ఆయన తొలుత హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
అనంతరం ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన అన్ని హాళ్లను చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవం, ఇతర కార్య క్రమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్‌ను వీక్షించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం అధి కారులను ఆదేశించారు.
అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్‌కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సీఎం అధికారులకు సూచించారు.
సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలుసూచనలు చేశారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా కలియతిరిగారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రపంచ దేశాలతోనే తెలంగాణ పోటీ : పొంగులేటి
గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుంది అని రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూప దని స్పష్టం చేశారు. శనివారం ఆయన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించామని చెప్పారు. గడచిన రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతోపాటు 2037 విజన్, 2047 విజన్ ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించబోతున్నామని చెప్పారు.


