ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతి రెడ్డి (Arundhati Reddy) గురువారం.. స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తాజాగా.. అరుంధతి రెడ్డి తెలంగాణ క్రీడా శాఖా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari)ని మర్యాద పూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి.. వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, కోచ్ ఆకాశ్, అరుంధతి తల్లి భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.
నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా దశాబ్దాల కలను నెరవేరుస్తూ నవీ ముంబై వేదికగా ట్రోఫీని అందుకుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అరుంధతి రెడ్డితో పాటు.. కడప బిడ్డ శ్రీ చరణి కూడా భాగస్వాములుగా ఉన్నారు.


