సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 18 మంది కార్మికులు సజీవ దహనమై పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడుధాటికి మృతదేహాలు స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.






ప్రమాదం సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి.

గతంలో భారీ పేలుళ్లు, విషాదాలు
బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. బాణా సంచా తయారీకి ప్రసిద్ధి చెందిన వేట్లపాలెం, పరిసర గ్రామాల్లో ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడం, పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్‌డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.
జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామం, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది.
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అలాగే గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడిక్కడే మరణించారు.


