అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పడగ విప్పింది. భార్యతో గొడవ పడిన ఓ ఎన్నారై.. విచక్షణ కోల్పోయి ఆమె కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి తప్పించుకున్న ముగ్గురు పిల్లలు అల్మారాలో దాక్కుని తమ ప్రాణాలు రక్షించుకోగలిగారు. జార్జియా స్టేట్‌లోని గ్వినెట్ కౌంటీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
భారత మూలాలున్న విజయ్ కుమార్(51), మీము డోగ్రా భార్యాభర్తలు. వీళ్లకు ఓ కొడుకు(12) ఉన్నాడు. ఈ కుటుంబం నివాసముంటోంది అట్లాంటాలో. అయితే ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొడుకును తీసుకుని గ్వినెట్ కౌంటీలోని బ్రూక్ ఐవీ కోర్ట్‌లో ఉన్న భార్య తరఫు బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీయదు.. కాసేపటికి 112 ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు.
పోలీసులకు కాల్ చేసింది విజయ్ కొడుకే. మరో ఇద్దరు పిల్లలతో కలిసి అల్మారాలో దాక్కున్నాడతను. తన తల్లితో తండ్రికి గొడవ జరిగిందని.. అది పెద్దదై తుపాకీతో ఆమెను, ఆమె బంధువులను కాల్చేశాడని ఆ చిన్నారి చెప్పాడు. తమనూ చంపే ప్రయత్నం చేయడంతో అక్కడ దాక్కున్నామని చెప్పాడు.
ఆ వెంటనే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంటి వెనుక గుండా సమీపంలోని అడవిలోకి పారిపోయిన విజయ్ ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విజయ్ భార్య మీమూతో పాటు గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్ మృతి చెందారని.. వాళ్లంతా ఆమె బంధువులని పోలీసులు నిర్ధారించుకున్నారు. విజయ్‌పై హత్య కేసు, పిల్లలపై క్రూరత్వం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అతని నుంచి విషయం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా భారతీయ కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురి చేసింది.
స్పందించిన భారత కాన్సులేట్
జార్జియాలో జరిగిన కాల్పుల ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ స్పందించింది. కుటుంబ వివాదం.. చివరకు విషాదంగా ముగియడం బాధాకరం. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తున్నాం అని ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.


