అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది. తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. వెనెజువెలాపై జరిపిన దాడులకు మించి ఇరాన్పై చేసే అవకాశం ఉందంటూ ప్రకటించారు.
ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ఇలా రాసుకొచ్చారు. "ఇరాన్ వైపు వెళ్తున్న అమెరికా నౌకాదళం... ఇంతకు ముందు వెనిజులాకు పంపిన దానికంటే పెద్దది. ఏమవుతుందో చూద్దాం" అని పేర్కొన్నారు. తద్వారా ఇరాన్ వైపునకు మరిన్ని బలగాలు పంపడం ద్వారా.. ఆ దేశంపై అణు ఒప్పందం విషయంలో ఒత్తిడి చేయాలన్నదే ట్రంప్ ప్రయత్నంగా కనిపిస్తోంది. అంతకు ముందు..
బుధవారం కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలే జారీ చేశారు. సమయం మించి పోతుందని.. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగి రాకపోతే పరిస్థితి దారుణంగా ఉండొచ్చని హెచ్చరించారు. అయితే అందుకు ఇరాన్ కూడా అదే రీతిలో స్పందించింది. తమ వేలు కూడా ట్రిగ్గరైపైనే ఉందని.. అమెరికా దాడులకు దిగితే ప్రతిస్పందన కూడా మునుపెన్నడూ లేని రీతిలో ఉంటుందని అంటోంది.
అమెరికా.. టైం తక్కువగా ఉంది, ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ వద్దకు రావాలి
ఇరాన్.. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా చర్చలకు సిద్ధం, కానీ ఒత్తిడి చేస్తే ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ప్రతిస్పందిస్తాం
ప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా భారీ నౌకాదళాన్ని మోహరించింది. ప్రధానంగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రెడీగా ఉంది. దీంతో పాటు యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు, సబ్మెరైన్లు.. అలాగే పైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఇరాన్ కూడా ప్రతిస్పందనగా తన షాహిద్ బఘేరి(Shahid Bagheri) డ్రోన్ క్యారియర్‌ను హార్ముజ్ జలసంధి వద్ద మోహరించింది.
హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు కీలకం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆంక్షలు కూడా..
ఇరాన్‌పై ఒత్తిడి చేసే క్రమంలో ట్రంప్ సర్కార్ కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెనీపై, అలాగే ఓ ఇరానీయన్ ప్రముఖ వ్యాపారవేత్తపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్లో ఇటీవల జరిగిన ప్రజా నిరసనలను మొమెనీ ఆధ్వర్యంలోని బలగాలు క్రూరంగా అణచివేశాయని.. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని.. అందుకే ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.


