
టెహ్రాన్: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.
భారత్‌పై చమురు దిగుమతుల ప్రభావం
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది.
ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ.