వాషింగ్టన్: ఇరాన్‌పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తమపై లేదంటే తమ మిత్రదేశాలపై ఇరాన్ ఎలాంటి దాడికి పాల్పడినా.. దానికి 20 రెట్లు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
అమెరికా దళాలు ఇరాన్‌పై వరుసగా రెండో రోజు దాడులు కొనసాగించాయి. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని ఇరాన్‌షహర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు, చిత్రాలను విడుదల చేశారు. ఈ స్థావరాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) వినియోగిస్తున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ తీర ప్రాంతంలోని బుషెర్, చాబహార్, కొనారక్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. బుషెర్‌లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది.
‘‘చూస్తూ ఊరుకోం’’: ట్రంప్
ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడినైనా తిప్పికొడతామని ట్రంప్ తెలిపారు. ‘‘వాళ్లు మమ్మల్ని ఒక్కసారి కొడితే.. మేము 20 రెట్లు బలంగా సమాధానం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని గతంలో ప్రకటించిన ట్రంప్.. చర్చలకు మాత్రం అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తుందా? అన్నదే ప్రధాన సందేహమని అన్నారు. అందుకే ఎలాంటి ఒప్పందం విషయంలోనూ తొందరపడబోమని స్పష్టం చేశారు. ఇది సాధారణ యుద్ధం కోసం చేస్తున్న చర్య కాదని.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ మౌనం వెనుక వ్యూహమేంటి?
అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌ను ప్రధాన భద్రతా ముప్పుగా చూస్తున్న ఇజ్రాయెల్.. తాజా పరిణామాలపై నిశితంగా గమనిస్తోంది. అయితే ఈ దశలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మౌనం పాటిస్తోంది. అమెరికా చర్యలకు మద్దతు ఇస్తూనే.. పరిస్థితులు ఏ దిశగా వెళ్తాయో అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతీకార చర్యలకు దిగిన ఇరాన్
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టంపై వెంటనే స్పష్టత రాలేదు. కువైట్ సైన్యం మాత్రం డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.
హర్ముజ్‌పై ఇరాన్ పట్టు
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ‘‘మీరు దాడి చేస్తే.. మిమ్మల్ని కూడా దాడి చేస్తాం’’ అంటూ హెచ్చరించారు. హర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు ఇరాన్ నిబంధనల ప్రకారమే సాగుతాయని తెలిపారు.
చర్చలకు బ్రేక్?
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తాజా పరిణామాలు అడ్డంకిగా మారాయి. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. బెదిరింపులు బలానికి సంకేతం కాదని, అమెరికా విధానాల వైఫల్యాన్ని చూపిస్తున్నాయని విమర్శించింది.
పెరిగిన చమురు ధరలు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చమురు ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


