జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.ఇండోనేషియా అత్యున్నత పురస్కారం 'బింతాంగ్ ఆదిపూర్ణ'ను ఆదేశ అధ్యక్షుడు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేతుల మీదుగా (మంగళవారం) పీఎం మోదీ అందుకున్నారు. ఈ అవార్డు కోట్లాదిమంది భారతీయులకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు.
భారత్-ఇండోనేషియా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారమైన 'బింతాంగ్ ఆదిపూర్ణ' ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రిఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..."ఈ ఉదయం నాకు ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆప్యాయతతో అందించారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు దక్కినది... ఇది ఇండోనేషియా ప్రజల సెంటిమెంట్‌కు, భారత్-ఇండోనేషియాల మధ్య ఉన్న చారిత్రాత్మక, సన్నిహిత సంబంధాలకు ప్రతీక. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవో జీకి, ఇండోనేషియా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని పీఎం మోదీ పేర్కొన్నారు.
విదేశాంగ శాఖ స్పందన
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అవార్డును "భారత్-ఇండోనేషియా స్నేహానికి దక్కిన నివాళి" గా అభివర్ణించారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడంతో పాటు, భారత్ - ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేయడానికి పీఎం మోదీ చేసిన నిరంతర కృషికి ఈ పురస్కారమే నిదర్శనమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
'బింతాంగ్ ఆదిపూర్ణ' పురస్కార చరిత్ర
ఈ అవార్డును 1959 లో ఇండోనేషియా ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన పురస్కారం. ఇండోనేషియా రిపబ్లిక్ యొక్క ఐక్యత, నిరంతర వృద్ధి, శ్రేయస్సు కోసం అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తారు.


