70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్‌ విమానం ఇదేనా? | Is This the Future of Air Travel?: Meet Startup Challenging Boeing Airbus | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్‌ విమానం ఇదేనా?

Jul 3 2026 12:50 PM | Updated on Jul 3 2026 1:55 PM

Is This the Future of Air Travel?: Meet Startup Challenging Boeing Airbus

ఆకాశంలో ఎగిరే విమానం ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచం ఒకటే సమాధానం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ సమాధానాన్నే మార్చేయాలనే ఓ స్టార్టప్‌ చేస్తున్న సాహసోపేత ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన విమానాల రూపమే గతం కావొచ్చనే చర్చా.. ఇటు విమానయాన రంగంలో మొదలైంది. ప్రపంచంలోని రెండు దిగ్గజ కంపెనీలు కూడా ఈ కొత్త ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!..

దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్‌ను రెండు దిగ్గజ సంస్థలు.. బోయింగ్, ఎయిర్‌బస్ శాసిస్తూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న బడా విమానాలన్నీ దాదాపుగా ఇవి రూపొందించినవే. అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్‌జీరో (JetZero) ఈ ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. సంప్రదాయ విమానాల కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో, ఇంధన వినియోగాన్ని సగానికి తగ్గిస్తామని చెబుతున్న కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తోంది.

రెక్కలు–శరీరం ఒకటే..
అమెరికాలోని మొహావే ఎడారిలో జెట్‌జీరో పూర్తి పరిమాణంలో ప్రదర్శన (డెమోన్స్ట్రేటర్) విమానాన్ని నిర్మిస్తోంది. సాధారణ విమానాల్లో శరీరం (ఫ్యూజలేజ్), రెక్కలు వేర్వేరుగా ఉంటాయి. కానీ జెట్‌జీరో ఆ డిజైన్‌కు పుల్‌స్టాప్‌ పెట్టే పని చేపట్టింది. ఆ కంపెనీ రూపొందిస్తున్న విమానంలో రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి. దీనినే ‘‘బ్లెండెడ్ వింగ్ బాడీ’’ (Blended Wing Body) డిజైన్ అంటారు. ఈ ఆకారం మంతా రే (Manta Ray) చేపను పోలి ఉంటుంది.

50 శాతం ఇంధనం ఆదా!
ప్రస్తుతం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు ఇంధనమే. జెట్‌జీరో విమానం సాధారణ జెట్‌లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. దీని ఆకారం కారణంగా.. గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు తక్కువ నిరోధం (డ్రాగ్) ఏర్పడటం వల్ల ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. విమానం వెనుక భాగంపై ఇంజిన్లను అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని కంపెనీ చెబుతోంది.

మరింత సుఖవంతమైన జర్నీ..
ఈ విమానం లోపలి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం ఆకారంలోని కేబిన్‌కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీంతో.. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. వంటగదులు (గ్యాలీలు), మరుగుదొడ్లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.

జెట్‌జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని జెట్‌జీరో అడుగులు వేస్తోంది.

నాసా పరిశోధనలకు కొనసాగింపు
బ్లెండెడ్ వింగ్ బాడీ ఆలోచన కొత్తది కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు పూర్తి పరిమాణంలో వాణిజ్య విమానాన్ని నిర్మించే స్థాయికి ఏ సంస్థా రాలేదు. ‘‘కొత్త టెక్నాలజీని కనిపెట్టడం కాదు... ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతను ఉపయోగించి వాణిజ్య విమానంగా మార్చడమే మా లక్ష్యం’’ అని జెట్‌జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ చెబుతున్నారు.

అమెరికా వైమానిక దళం అండ
జెట్‌జీరో ఆషామాషీ కంపెనీ ఏం కాదు. 2023లో అమెరికా వైమానిక దళం ఈ ప్రాజెక్టు కోసం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌(United Airlines), అలస్కా ఎయిర్‌లైన్స్‌ (Alaska Airlines) వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా జెట్‌జీరోలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై విమానయాన రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.

2030 నాటికి..
జెట్‌జీరో లక్ష్యం ప్రకారం డెమోన్స్ట్రేటర్ విమానం వచ్చే ఏడాది(2027) నాటికి తొలి పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఈ డిజైన్‌ను సైనిక రవాణా, గగనతల ఇంధన నింపే (Aerial Refueling) విమానాలుగా కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.

సవాళ్లు భారీగానే.. 
ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ నిజంగానే ప్రకటించిన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి ధ్రువీకరణ పొందడానికి సంవత్సరాల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ‘‘ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. కానీ అసాధ్యమని కూడా చెప్పలేం’’ అని విమానయాన రంగపు విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయపడుతున్నారు.

విమానాల రూపకల్పనలో దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మార్పులు రాలేదు. జెట్‌జీరో ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో మనం ప్రయాణించే విమానాల ఆకారంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన అనేక పరీక్షలను ఈ స్టార్టప్ విజయవంతంగా దాటాల్సి ఉంటుంది.

:::వెబ్‌ స్పెషల్‌

నోట్‌: కథనంలో చూపించిన విమానం తాలుకా ఫొటోలు ఏఐ జనరేటెడ్‌వి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా పాఠకుడికి చూపించాం..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement