రామ మందిరం విరాళాల చోరీపై సుప్రీంకోర్టు
యూపీ ప్రభుత్వం అభిప్రాయం కోరిన అత్యున్నత న్యాయస్థానం
రాజకీయాలు చేయొద్దంటూ హితవు
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ అంశంపై సమగ్ర దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయగలరా అంటూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు సీనియర్ అధికారులతో యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఇదే బృందానికి ఈ బాధ్యతను దర్యాప్తునకు అప్పగించే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.
దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పేర్కొంది. మందిరంలో విరాళాల గోల్‌మాల్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని ధర్మాసనం హితవు పలికింది. న్యాయస్థానాలు రాజకీయాలకు వేదికలు కావని, ఈ అంశాన్ని కేవలం ఒక నేరంగా మాత్రమే పరిగణించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటమే తమ బాధ్యతని పేర్కొంది.
దర్యాప్తు పురోగతి నివేదిక
ఈ నెల 13వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పోలీసుల దర్యాప్తు పురోగతి నివేదికను సోమవారం ధర్మాసనానికి సమర్పించారు. ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు తెలుసుకునేందుకు తొలుత ఓ ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నేరం జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించడంతో, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారని వివరించారు. స్పందించిన ధర్మాసనం.. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం సీనియర్ అధికారులతో కూడిన ప్రస్తుతమున్న సిట్‌కు బాధ్యతలు అప్పగించగలరా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.


