రెండూ బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంలో మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, అదేమాదిరి వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రెండూ బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడు అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి.
ఇదే ఆశతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుందాం. అదే విధంగా ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం ఫలప్రదంగా సాగాలనీ కోరుకుందాం. సభలో నిర్మాణాత్మక చర్చల ద్వారా దేశ ప్రగతికి, ప్రజా సంక్షేమానికి దోహదపడాలి. రాజకీయాలకు అతీతంగా అనుభవజ్ఞులైన ఎంపీల విజ్ఞానం దేశాభివృద్ధి కోసం ఉపయోగపడాలి. బలమైన వాదనలు ఉన్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడినా మన గళాన్ని సమర్థవంతంగా వినిపించవచ్చు’’అని మోదీ చెప్పారు.
అంతరిక్ష రంగంలో యువత అద్భుతాలు...
‘‘దేశ పురోగతిలో యువత పాత్ర అత్యంత కీలకం. వారి సామర్థ్యాలు, ఆకాంక్షలు అంతరిక్షమంత విశాలమైనవి. గడిచిన నెల రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రంగాల్లో అసాధారణ మైలురాళ్లను భారత్ అధిగమించింది. భారతీయ వ్యోమగామి గత ఏడాది వర్షాకాల సమావేశాల ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈసారి వర్షాకాల సమావేశాలకు ముందు భారతీయ అంకుర సంస్థ స్కైరూట్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా గగనతలంలోకి వెళ్లింది. భారతీయ యువత ఆశలు, ఆశయాలకు నింగిలాగా ఎలాంటి హద్దుల్లేవనడానికి ఈ విజయమే నిదర్శనం’’అని మోదీ కొనియాడారు.
7.7 శాతం వృద్ధిరేటు...
‘‘పశి్చమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ భారతదేశం 7.7 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం దేశానికున్న అపారమైన శక్తికి నిదర్శనం’’అని మోదీ అన్నారు.
56 ఏళ్ల యువకుని గురించి మాట్లాడట్లేదు
రాహుల్‌కు మోదీ చురక
స్కైరూట్ సంస్థ విజయం గురించి మాట్లాడుతూ రాహుల్ గాందీనుద్దేశిస్తూ మోదీ పరో క్షంగా వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. యువకులు ఎంతో సాధిస్తున్నారని, రాహుల్ 56 ఏళ్లు వచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారనే అర్థం ధ్వనించేలా మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘‘అంతరిక్షంలో అద్భుతం సృష్టించిన స్కైరూట్ అంకురసంస్థలోని బృంద సభ్యుల సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమే. యువత అద్భుతాలు చేస్తోంది. నేనిక్కడ 56 ఏళ్ల యువకుడి(రాహుల్) గురించి మాట్లాడటం లేదు. 28 ఏళ్ల వయస్సున్న దేశీయ యువతే అంతరిక్షంలో భారత జెండాను ఎగరేసింది’’అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగానికి కల్పించిన సంస్కరణల వల్లే సాహసోపేతమైన విజ యాలను యువత సాధిస్తోందని మోదీ అన్నారు.


