సిరీస్‌ మనదే  | India clinches the T20I series against Zimbabwe | Sakshi
Sakshi News home page

సిరీస్‌ మనదే 

Jul 26 2026 12:51 AM | Updated on Jul 26 2026 12:51 AM

 India clinches the T20I series against Zimbabwe

జింబాబ్వేతో రెండో టి20లో 90 పరుగుల తేడాతో భారత్‌ విజయం 

ఇషాన్, తిలక్‌ మెరుపులు 

నేడు మూడో టి20 

సాయంత్రం గం. 4:30 నుంచి యునైట్‌ 8 స్పోర్ట్స్‌ చానెల్, ఫ్యాన్‌ కోడ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

హరారే: స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రికెట్‌ జట్టు... జింబాబ్వేపై టి20 సిరీస్‌ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో సిరీస్‌ పట్టేసింది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్‌ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు. గత మ్యాచ్‌లో రికార్డు అర్ధ శతకం నమోదు చేసిన 15 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 

అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్‌ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్‌ యశ్‌ ఠాకూర్, ప్రిన్స్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది.  

వైభవ్‌ ఆరంభ మెరుపులు... 
ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌... ఈ మ్యాచ్‌లో దంచికొట్టింది. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్‌ శర్మ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో సూర్యవంశీ వరుసగా 4, 6, 4, 4 బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయతి్నంచి అవుటయ్యాడు. 

మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (25; 4 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోగా... 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 95/3తో నిలిచింది. అక్కడి నుంచి ఇషాన్, తిలక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ... చెత్త బంతులపై విరుచుకుపడింది. 

ఈ క్రమంలో ఇషాన్‌ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో తిలక్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో హోరెత్తించాడు. మరుసటి ఓవర్‌లో ఇషాన్‌ 4, 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో మధ్య ఓవర్లలో భారత్‌ మెరుగైన స్కోరు చేసింది. ధాటిగా ఆడిన తిలక్‌ 23 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్‌ దాటాడు. 

తిప్పేసిన అభిషేక్‌... 
లక్ష్యఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే పోటీలో కనిపించలేదు. ఓపెనర్‌ బెన్నెట్‌ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్‌లు ఆడగా... అతడిని తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న యశ్‌ ఠాకూర్‌ అవుట్‌ చేశాడు. ఆ వెంటనే బెన్‌ కరెన్‌ (1) పెవిలియన్‌ చేరగా... మైయర్స్‌ (12),

సికందర్‌ రజా (0) 
విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బర్ల్‌ (20; 2 ఫోర్లు), మరుమని (24; 1 ఫోర్, 1 సిక్స్‌), ఇవాన్స్‌ (19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో... భారత సారథి శ్రేయస్‌ బంతిని పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌లు అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మకు అందించాడు. వారిద్దరూ లోయర్‌ ఆర్డర్‌ పనిపట్టడంతో జింబాబ్వే ఆలౌటైంది.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: వైభవ్‌ (సి) ముజరబాని (బి) ఎన్‌గరవా 20; అభిషేక్‌ (సి) బర్ల్‌ (బి) ముజరబాని 8; ఇషాన్‌ (సి) బెన్నెట్‌ (బి) న్యూమన్‌ 81; శ్రేయస్‌ (సి) ఇవాన్స్‌ (బి) బెన్నెట్‌ 25; తిలక్‌ (నాటౌట్‌) 60; రింకూ (సి) బర్ల్‌ (బి) ఇవాన్స్‌ 12; శివమ్‌ దూబే (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. 

వికెట్ల పతనం: 1–10, 2–29, 3–95, 4–189, 5–213. 

బౌలింగ్‌: సికందర్‌ రజా 4–0–47–0; ముజరబాని 4–0–36–1; ఎన్‌గరవా 3–0–43–1; ఇవాన్స్‌ 4–0–44–1; న్యూమన్‌ 3–0–25–1; బెన్నెట్‌ 2–0–22–1.  

జింబాబ్వే ఇన్నింగ్స్‌: బెన్నెట్‌ (సి) ఇషాన్‌ (బి) యశ్‌ 32; కరన్‌ (సి) శివమ్‌ దూబే (బి) ప్రిన్స్‌ 1; మైయర్స్‌ (బి) రవి బిష్ణోయ్‌ 12; బర్ల్‌ (సి) రింకూ (బి) తిలక్‌ 20; సికందర్‌ రజా (సి) ఇషాన్‌ (బి) ప్రిన్స్‌ 0; మదెవెరె (సి) శ్రేయస్‌ (బి) శివమ్‌ దూబే 2; మరుమని (బి) యశ్‌ 24; ఇవాన్స్‌ (బి) అభిషేక్‌ 19; న్యూమన్‌ (బి) అభిషేక్‌ 3; ఎన్‌గరవా (సి) రింకూ (బి) అభిషేక్‌ 1; ముజరబాని (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్‌) 129. 

వికెట్ల పతనం: 1–34, 2–34, 3–48, 4–49, 5–65, 6–82, 7–105, 8–119, 9–121, 10–129. 

బౌలింగ్‌: మయాంక్‌ 3–0–25–0; యశ్‌ ఠాకూర్‌ 4–0–30–2; ప్రిన్స్‌ 1.2–0–10–2; రవి బిష్ణోయ్‌ 4–0–20–1; శివమ్‌ దూబే 1.4–0–13–1; తిలక్‌ వర్మ 1–0–9–1; అభిషేక్‌ 2.5–0–17–3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement