టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ తన ఫామ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధనమిచ్చాడు. శనివారం హరారే వేదికగా జింబాబ్వేతో రెండో టీ20లో తిలక్ విధ్వసంకర హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ హైదరాబాదీ మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.
ఈ క్రమంలో తిలక్ కేవలం 23 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇది 9వ టీ20 హాఫ్ సెంచరీ. మొత్తంగా భారత వైస్ కెప్టెన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో కిషన్ 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా ఇటీవల కాలంలో తిలక్ ఆట తీరుపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు.
చాలా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడని, జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందిచిన తిలక్.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పుడు మరోసారి తనలోని హిట్టర్‌ను తిలక్ బయటపెట్టాడు. తనకు దూకుడుగా ఆడడంతో పాటు సమయస్పూర్తితో కూడా ఆడడం తెలుసు అని తిలక్ చాటి చెప్పాడు.
చదవండి: భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్


