వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక | India Planning To Turn Vaibhav Sooryavanshi Into An All Rounder | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక

Jul 25 2026 3:05 PM | Updated on Jul 25 2026 3:11 PM

India Planning To Turn Vaibhav Sooryavanshi Into An All Rounder

source: X

టీమిండియా బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్‌ను భవిష్యత్తులో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భారత క్రికెట్‌ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత స్టాండ్‌-ఇన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి, తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నాడు.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పైనా దృష్టి
వైభవ్‌లో బౌలింగ్ సామర్థ్యం కూడా ఉందని, సమయం లభించిన ప్రతిసారీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతనితో ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపారు. బౌలింగ్‌లో మెరుగుదల కనిపించిన వెంటనే దానిపై పూర్తి దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అయితే ప్రస్తుతానికి బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, హరారే మైదానం వైభవ్‌కు కలిసొచ్చే ప్రాంతమని, గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచారని జోషి గుర్తుచేశారు.

కాగా, జోషి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైభవ్‌ను తొందరపడి అంతర్జాతీయ స్థాయిలో బౌలర్‌గా వినియోగించే ఆలోచనలో లేదని, దశలవారీగా పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బౌలింగ్‌ అనుభవం
వైభవ్ ఎడమచేతి ఆఫ్ స్పిన్నర్‌గా పార్ట్‌టైమ్ బౌలింగ్ చేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అతని బౌలింగ్ అనుభవం పరిమితం. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో మూడు ఇన్నింగ్స్‌లు బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు.

మొత్తంగా బౌలింగ్‌లో దాదాపు అనుభవం లేని వైభవ్‌ను సరైన శిక్షణతో తీర్చిదిద్దగలిగితే, భారత జట్టు కూర్పుకు మరింత వైవిధ్యం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో ఆల్‌రౌండర్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ నిర్ణయం ఆశ్చర్యకరం కాదని కథనాలు పేర్కొంటున్నాయి.

నేడే రెండో టీ20
భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న సిరీస్‌లో రెండో టీ20 నేడు (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20 గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement