3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.
హంబన్‌తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
పాక్ ఇన్నింగ్స్‌లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్‌తోట వేదికగా జులై 28న జరుగనుంది.


