టీమిండియా మాజీ క్రికెటర్ రాజేశ్ చౌహాన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ. 15 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జులై 24న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం) కింద కేసు నమోదైంది.
ఆరోపణ ఏంటంటే..?
మాజీ భారత, మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్, జిందాల్ స్టీల్ కంపెనీతో ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టు కుదిర్చిస్తానని దింకర్ విశ్వమిత్ర అనే వ్యక్తికి హామీ ఇచ్చి రూ. 15.1 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణ. ఈ మేరకు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించగా, పోలీస్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు. దీంతో 2021 జులైలో చౌహాన్ సంస్థ 'గోవింద్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ'తో విశ్వమిత్ర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట చెక్కు రూపంలో రూ. 2.51 లక్షలు, అనంతరం మిగిలిన రూ. 12 లక్షలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.
అయితే పెట్టుబడి అనంతరం చౌహాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఫిర్యాదుదారు నేరుగా జిందాల్ స్టీల్ లిమిటెడ్‌ను సంప్రదించగా, చౌహాన్‌కు కానీ, గోవింద్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి కానీ ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు.
చౌహాన్ స్పందన
ఈ వ్యవహారంపై గతంలో పీటీఐతో మాట్లాడిన చౌహాన్, ఇది వ్యాపార వివాదం మాత్రమేనని పేర్కొన్నారు. "ఫిర్యాదుదారుకు చెందిన కొంత మొత్తాన్ని ఇప్పటికే తిరిగి చెల్లించాం. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మొత్తం చెల్లింపులో ఆలస్యం జరిగింది" అని ఆయన వివరణ ఇచ్చారు.
క్రికెట్ కెరీర్
బిహార్‌లో జన్మించిన రాజేష్ చౌహాన్ 1988/89 నుంచి 2000/01 వరకు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 1993లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్‌లో దాదాపు 100 ఫస్ట్-క్లాస్, అంతే సంఖ్యలో లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 400కు పైగా వికెట్లు తీశారు. 2000/01లో క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, 59 ఏళ్ల చౌహాన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.


