టీమిండియా తరపున మరో యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. హరారా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో పేసర్ యశ్ ఠాకూర్ భారత్ తరపున డెబ్యూ చేశాడు. తొలి టీ20 ఆడిన అశోక్ శర్మను పక్కన పెట్టి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఎవరీ యశ్ ఠాకూర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ యశ్ ఠాకూర్?
27 ఏళ్ల యశ్ ఠాకూర్ 1998లో కోల్‌కతాలో జన్మించాడు. కానీ ఈ రైట్ ఆర్మ్ పేసర్ దేశవాళీ క్రికెట్‌లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు ఇప్పటికే రంజీలతో పాటు లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
భారత్ 'ఎ' జట్టు తరపున కూడా అతడు తన మార్క్ చూపించాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుమందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.
ఈ ఏడాది సీజన్‌కు ముందు అతడిని రూ. 1.60 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను తన ఆదర్శంగా తీసుకున్న యశ్ ఠాకూర్.. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దిట్ట.
ఈ క్రమంలోనే అతడికి భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడే అవకాశం దక్కింది. ఈ విదర్భ పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు.
తుది జట్లు
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ


