‘వైభ‌వ్‌ నా తమ్ముడు.. నేనిచ్చే స‌ల‌హా అదొక్క‌టే’ | Ishan Kishan Advice Vaibhav-Sooryavanshi-Think About-Cricket-Not Social Media | Sakshi
Sakshi News home page

‘వైభ‌వ్‌ నా తమ్ముడు.. నేనిచ్చే స‌ల‌హా అదొక్క‌టే’

Jul 26 2026 9:22 AM | Updated on Jul 26 2026 11:08 AM

Ishan Kishan Advice Vaibhav-Sooryavanshi-Think About-Cricket-Not Social Media

Photo Credit: BCCI Twitter

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో తొలి టీ20లో మెరుపు అర్ధ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న వైభ‌వ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. 9 బంతుల్లో 20 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే పాకెట్ డైన‌మైట్‌ ఇషాన్ కిష‌న్ (44 బంతుల్లో 81), తిల‌క్ వ‌ర్మ (29 బంతుల్లో 60 నాటౌట్‌) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌తో టీమిండియా రెండో టీ20లో 90 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంత‌రం ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఇషాన్ కిష‌న్ వైభ‌వ్ సూర్య‌వంశీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు వైభ‌వ్‌కు ఎలాంటి స‌ల‌హాలు ఇస్తుంద‌ని ఇషాన్ కిష‌న్‌ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోష‌ల్ మీడియా, ఇత‌ర విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కేవ‌లం త‌న ఆట‌పై దృష్టి పెట్టాల‌ని మాత్ర‌మే వైభవ్‌కు ఒక అన్నలా స‌ల‌హా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభ‌వ్‌కు ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న కార‌ణంగా అత‌డిని కాపాడుకునేందుకు భార‌త జ‌ట్టు ఒక స్ప‌ష్ట‌మైన వ్యూహాన్ని, ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించింద‌ని ఇషాన్ కిష‌న్ తెలిపాడు.

ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత ప‌ర‌ధ్యానం ఉండొచ్చు. మ‌న స్నేహితుల వ‌ల్ల కూడా కొంత డిస్ట‌ర్బెన్స్ ఉండొచ్చు. 

నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాల‌న్న దానిపై క్లియ‌ర్‌గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభ‌వ్‌తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్య‌వ‌హ‌రిస్తారు. 

ప్రస్తుతం వైభ‌వ్‌ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్న‌ది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫ‌ల‌మైన‌ప్పుడు త‌నపై వచ్చే విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి కేవ‌లం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభ‌వ్‌ది చిన్న వ‌య‌సు కాబ‌ట్టి త‌ప్పుడు కార‌ణ‌ల వ‌ల్ల ప‌ర‌ధ్యానంలోకి వెళ్ల‌కూడ‌ద‌ని కోరుకుంటాం. 

స‌హ‌చ‌రులుగా మేమంతా వైభ‌వ్‌ను ఒక త‌మ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.

 

Read: హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జ‌ట్టుకు విజ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement