ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం.
మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు.
వందేమాతరం @ 150
1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి
పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్‌కాంగ్‌లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్‌నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు.
జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం
సెపె్టంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది.
దీపావళికి విశ్వ కిరీటం
భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.
మరాఠా కోటల ప్రపంచ రికార్డు
జూలైలో పారిస్‌లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్‌గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం.
మహనీయుల స్మరణ
అహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు.
ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సు
యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’!
– సాక్షి, నేషనల్ డెస్క్


