నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు | ED Issues Notices To Actress Nidhhi Agerwal Over Online Betting Promotion, Statement To Be Recorded | Sakshi
Sakshi News home page

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు

Aug 19 2026 9:06 AM | Updated on Aug 19 2026 10:08 AM

ED Issues Notices To Nidhhi Agerwal Over Online Betting Promotion

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సినీనటి నిధి అగర్వాల్‌ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారంలో ఆమె స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.

బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ల ప్రచారంలో సినీ సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఆయా ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేసినందుకు సెలబ్రిటీలకు జరిగిన చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, వాటికి సంబంధించిన మనీలాండరింగ్‌ కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 29 మంది సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ప్రముఖులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలు ప్రకటనలు, సోషల్‌ మీడియా ప్రచారాల ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్‌ చేశారని, వాటి ద్వారా ప్రజలను డబ్బులు పెట్టేలా ప్రోత్సహించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాశ్‌ రాజ్‌, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్‌, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్లతో పాటు పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. 

గతంలో పలువురు సెలబ్రిటీలు తాము చట్టబద్ధమైన ఆన్‌లైన్‌ స్కిల్‌-బేస్డ్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ప్రచారం చేశామని, అక్రమ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్‌ నుంచి ఈడీ అధికారులు ఎలాంటి వివరాలు రాబడతారు, ఆమెకు జరిగిన చెల్లింపులు, ప్రచార ఒప్పందాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటన్నది విచారణలో కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement