
మెట్రో రైలు నిర్వహణను వదిలించుకునే యోచనలో ఎల్‌అండ్‌టీ
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధం
ఈ మేరకు కేంద్రానికి లేఖ
రూ.5 వేల కోట్లకు పైగా నష్టాల్లో హైదరాబాద్ మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్‌ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీ తేల్చిచెప్పింది. నగరంలోని మూడు కారిడార్‌లలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రోరైల్ నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది.
వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మెట్రో రెండో దశ డీపీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం వివరణ కోరిన సంగతి తెలిసిందే. టికెట్ చార్జీల పంపకాలు, విద్యుత్ చార్జీల చెల్లింపులు, అసంపూర్తిగా ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు తదితర అంశాలపై ఎల్‌అండ్‌టీతో ఏ రకమైన అవగాహన ఏర్పాటు చేసుకున్నారో తెలియజేయాలని చెప్పింది. ఈ సంప్రదింపుల క్రమంలోనే ఎల్‌అండ్‌టీ సంస్థ కేంద్ర గృహనిర్మాణశాఖ సంయుక్త కార్యదర్శి జైదీప్‌కు లేఖ రాసింది. దేశంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన మొదటి మెట్రో ఇదే కావడం గమనార్హం.
బకాయిలు రూ.5,000 కోట్లకు పైనే..
హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. సుమారు రూ.22 వేల కోట్లతో 69 కి.మీ.పొడవున నిర్మించారు. ఈ మొదటి దశకు సంబంధించిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. కారిడార్ మాత్రం పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం దీన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి రెండో దశలో కలిపేశారు.
మొదటి కారిడార్ పూర్తయిన 2017 నాటికి, ఎల్ అండ్ టీకి ప్రభుత్వం రూ. 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 ఫిబ్రవరి నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగాయి. మరోవైపు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఇవ్వాల్సిన రూ.254 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదని ఎల్‌అండ్‌టీ పేర్కొంది. ప్రస్తుతం మెట్రోలో రోజూ వారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
చాలని టికెట్ ఆదాయం
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్‌లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలకపోవడం వంటి కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు ఎల్‌అండ్‌టీ వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, విద్యుత్‌చార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చులు పెనుభారంగా మారినట్లు పేర్కొంది. మెట్రో మొదటిదశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది.
మెట్రో రెండో దశ ప్రతిపాదనలివీ..
» ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, నాగోల్–ఎల్‌బీనగర్–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎల్‌బీనగర్–హయత్‌నగర్, రాయదుర్గం–అమెరికన్ కాన్సులేట్–హైకోర్టు భవనం, మియాపూర్–బీహెచ్‌ఈఎల్ తదితర మార్గాల్లో ‘ఏ’విభాగం కింద మొత్తం 5 కారిడార్‌లలో 76.5 కి.మీ. మేర నిర్మించనున్నారు.
» సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు (23 కి.మీ.) ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు (22 కి.మీ,), ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు 39.6 కి.మీ నిర్మించాలని ప్రతిపాదించారు.
» ఏ, బీ విభాగాల్లోని మొత్తం 8 కారిడార్‌ల నిర్మాణానికి రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చుకానున్నట్లు అంచనా.