కొత్తబండికీ కొర్రీలు | - | Sakshi
Sakshi News home page

కొత్తబండికీ కొర్రీలు

Dec 14 2025 1:37 PM | Updated on Dec 14 2025 1:37 PM

కొత్తబండికీ కొర్రీలు

కొత్తబండికీ కొర్రీలు

దళారుల ద్వారా వస్తే సరే...లేదంటే వెనక్కి

సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరికి చెందిన సదానంద్‌ రెండు రోజుల క్రితం తన కొత్త ద్విచక్ర వాహనం శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఉప్పల్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సంప్రదించారు. నిబంధనల మేరకు స్లాట్‌ నమోదు చేసుకుని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో వెళ్లారు. కానీ బండి నమోదుకు అవసరమైన మొత్తం పత్రాలు లేవంటూ తిప్పి పంపించారు. దాంతో అతడు మరోసారి షోరూమ్‌లో సంప్రదించాల్సి వచ్చింది. వాహనానికి సంబంధించిన తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌)పత్రాలతో పాటు ఇన్వాయీస్‌, బీమా పత్రాలు సహా అన్నింటిని మరోసారి పరిశీలించుకుని ఆధార్‌, పాన్‌కార్డుతో పాటు చిరునామా ధృవీకరణ కోసం వంటగ్యాస్‌ కనెక్షన్‌ పత్రాలను కూడా తీసుకుని మరోసారి ఉప్పల్‌ ఆర్టీఏకు వెళ్లారు. వంట గ్యాస్‌ పత్రాలు ఒరిజినల్‌ కావాలంటూ మరోసారి మెలిక పెట్టి వెనక్కి పంపించారు. ఇది ఒక్క ఉప్పల్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే కాదు, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చాలా చోట్ల ఇదే పరిస్థితి. అన్ని రకాల డాక్యుమెంట్‌లతో స్వయంగా వెళ్లే వాహనదారులను ఆర్టీఏ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏజెంట్‌లు, దళారుల ద్వారా వెళ్లేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. పాన్‌కార్డు, ఆధార్‌ వంటి బలమైన ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ ఏదో ఒక నెపంతో కొర్రీలు వేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

షోరూమ్‌లలోనూ చేతివాటమే...

ఆర్టీఏ కార్యాలయాల్లోనే కాకుండా వాహనాల షోరూమ్‌లలోనూ కొత్త బండ్లపైన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాండ్లింగ్‌ చార్జీల పేరిట, యాక్సెసరీస్‌ పేరిట బైక్‌లు, కార్లు, తదితర వాహనాలపై రూ.5000 నుంచి రూ.20 వేల వరకు అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణంగా వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, ఆర్టీఏ కార్యాలయంలో బండి శాశ్వత నమోదు ఫీజులను కూడా షోరూమ్‌లోనే చెల్లిస్తారు. మరో రూ.3000 అదనంగా వసూలు చేసి షోరూమ్‌ నుంచి ఏజెంట్‌ను ఏర్పాటు చేస్తారు. నిజానికి కొత్త వాహనానికి అన్ని పత్రాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏజెంట్‌ల అవసరం ఉండదు. వాహనదారులు బండి కొనుగోలు చేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో తమకు వీలైనప్పుడు స్లాట్‌ నమోదు చేసుకుని ఆర్టీఏ అధికారులను సంప్రదించవచ్చు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సదరు వాహనం చాసీస్‌ నెంబర్‌, ఇంజన్‌ నెంబర్‌, తదితర వివరాలను, డాక్యుమెంట్‌లను పరిశీలించి శాశ్వత నమోదుకు అవకాశం కల్పించాలి. షోరూమ్‌ ఏజెంట్‌లు లేదా దళారులకు రూ.3000 నుంచి రూ.5000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. కానీ ఏజెంట్‌లతో కాకుండా స్వయంగా వెళ్లే వాహనదారులకు మాత్రం ఏదో ఒక పత్రం లేదంటూ (అన్నీ ఉన్నా) వేధించి వెనక్కి పంపిస్తారు. దీంతో సదరు వాహనదారుడు అనివార్యంగా ఏజెంట్‌ను లేదా దళారిని ఆశ్రయించాల్సి వస్తుంది. సిటీలో 2500 నుంచి 3000 లకు పైగా వాహనాలు నమోదవుతున్నాయి.

అన్ని రకాల పత్రాలున్నా ఏదో ఒక సాకుతో వేధింపులు

గ్రేటర్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే దందా...

షోరూమ్‌లలో శాశ్వత నమోదుకు అవకాశం లేకపోవడమే కారణం...

షోరూమ్‌ రిజిస్ట్రేషన్‌లు ఏమైనట్లు..

కేంద్రం అమల్లోకి తెచ్చిన రహదారి భద్రతా చట్టంలో కొత్త వాహనాలకు షోరూమ్‌లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పించాలని సూచించారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నాలుగైదేళ్లుగా షోరూమ్‌లలోనే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ పత్రాలతో పాటు హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌ను కూడా అమర్చి బండిని కొనుగోలుదారుడికి అప్పగిస్తున్నారు. ఒకసారి వాహనం కొనుగోలు చేసిన తరువాత పదే పదే ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఈ సదుపాయాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.కొన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ నాలుగేళ్ల క్రితమే రవాణా అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement