నడక దారుల కోసం..
ఆధునిక సాంకేతికతతో అధ్యయనం
● సీఆర్‌ఎంపీ రెండో దశలో 3,805 లేన్ కిలోమీటర్ల పనులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కాంట్రాక్టు ముగిసి దాదాపు ఏడాది కావస్తోంది. తిరిగి కాంట్రాక్టు ఏజెన్సీని నియమించలేదు. రెండో దశ కింద ప్రధాన రహదారుల్లోని రోడ్లే కాక, ఇతరత్రా ముఖ్యమైన రోడ్లను సైతం కలిపి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అందుకయ్యే వ్యయం, తదితరాలను పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ అనుమతి రాగానే తిరిగి కాంట్రాక్టు కోసం ఏజెన్సీలను ఆహ్వానించనున్నారు. ఈసారి ప్రధాన రహదారుల్లోని బీటీ రోడ్లే కాక సీసీ, వీడీసీసీ ఇతరత్రా రోడ్లను సైతం సీఆర్‌ఎంపీ కిందకు తేనున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలకు రహదారులతో పాటు పాదచారులు నడిచేందుకు నడకదారులు కూడా బాగుండాలనే తలంపుతో ఉన్నారు. అందుకుగాను రోడ్ల పనులు చేపట్టేనాటికే నడకదారుల సామర్థ్యం తదితరమైవి తెలుసుకోవడంతో పాటు కొత్తగా నడకమార్గాలు వచ్చే ప్రాంతాల్లోనూ నేల స్వభావం తదితరమైనవి తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతికత వినియోగంతో సర్వే చేయాలని భావిస్తున్నారు. సర్వే నిర్వహించేందుకు ముందుకొచ్చే సంస్థల కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.
దీర్ఘకాలం మన్నికగా ఉండేలా..
సర్వే కోసం నెట్‌వర్క్ సర్వే వె హికల్ (ఎన్‌ఎస్‌వీ–3డీ) ఫాలింగ్ వెయిట్ డిఫ్లెక్టోమీటర్(ఎఫ్‌డబ్ల్యూడీ), గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి ఆధునిక సాంకేతికత వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలనేది లక్ష్యం. నగరంలో వాహన రద్దీ పెరిగిపోవడం, వివిధ యుటిలిటీల కోసం రోడ్లను తరచూ తవ్వుతుండటం వంటి పనులతో రోడ్లు, నడకమార్గాలు కూడా తరచూ దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రోడ్ల పరిస్థితులను కూడా అంచనా వేసి దీర్ఘకాలం మన్నిక ఉండేలా నడకమార్గాలు నిర్మించేందుకు సాంకేతిక సర్వేకు సిద్ధమయ్యారు. దాదాపు 3,805 లేన్ కిలోమీటర్ల మేరకు నడక మార్గాల కోసం ఆధునిక సాంకేతికతతో సర్వే జరిపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


