రెండో విడతకు రె‘ఢీ’
● చేవెళ్ల, కందుకూరు డివిజన్లలో ఎన్నికలు
● పోలింగ్, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నేడు రంగారెడ్డి జిల్లాలో మలిదశ పంచాయతీ పోరు
ఆమనగల్లు/చేవెళ్ల: రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్‌లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్‌లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలోని 61 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 12 చోట్ల 40 మంది అభ్యర్థులు, 112 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా 92 స్థానాలకు 258 మంది పోటీలో ఉన్నారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు నాలుగు ఏకగ్రీవం కాగా 20 సర్పంచ్ స్థానాలకు 59 మంది, 210 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు 453 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తలకొండపల్లి మండలంలో 32 పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 29 సర్పంచ్ స్థానాలకు 85 మంది, 272 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 223 వార్డులకు 567 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చేవెళ్ల డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలంలో 25 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 19 పంచాయతీ సర్పంచ్‌లకు 59 మంది, షాబాద్‌లో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 40 గ్రామాల్లో 111 మంది అభ్యర్థులు, శంకరపల్లి మండలంలో 24 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 22 చోట్ల సర్పంచ్ పదవికి 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చేవెళ్ల మండలంలో 183 వార్డులకు 469 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 157 వార్డులకు 434 మంది, షాబాద్ మండలంలో 305 వార్డులకు 794 మంది, శంకర్‌పల్లి మండలంలో 188 వార్డులకు 463 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద శనివారం సిబ్బందికి అధికారులు సామగ్రి అప్పగించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈమేరకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడ్తాల్: ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందజేస్తున్న అధికారులు
ఎన్నికలు జరగనున్న మండలాలు: 7
మొత్తం సర్పంచ్ స్థానాలు: 165
మొత్తం వార్డు స్థానాలు: 1,306
బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 499
పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు: 3,508
పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు


