కొత్త మెట్రో రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ | New Trains for Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

Hyderabad: కొత్త మెట్రో రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

Jul 8 2025 7:22 PM | Updated on Jul 8 2025 9:04 PM

New Trains for Hyderabad Metro Rail

త్వరలో బీఈఎంఎల్‌తో ఎల్‌అండ్‌టీ ఒప్పందం

18 నెలల వ్యవధిలో కొత్త రైళ్లు పట్టాలెక్కేలా చర్యలు

3 రూట్లలో 10 మెట్రోలను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు

ప్రస్తుతం 5 లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య

సాక్షి, హైద‌రాబాద్‌: కొత్త మెట్రో రైళ్లకు ఎల్‌అండ్‌టీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మెట్రోరైళ్ల తయారీ సంస్థ భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. బీఈఎంఎల్‌ సంస్థ ఇప్పటికే  మెట్రోలను తయారు చేసి పలు నగరాలకు అందజేస్తున్న దృష్ట్యా ఆ సంస్థతోనే  ఒప్పందం  చేసుకొనే  అవకాశం ఉంది. గతంలో మొదటి దశ రైళ్లను కొరియా నుంచి తెప్పించిన సంగతి తెలిసిందే. బెంగళూరు కేంద్రంగా నెలకొల్పిన బీఈఎంఎల్‌తో పాటు మరికొన్ని తయారీ సంస్థలు కూడా ఈ రంగంలో పని చేస్తున్నాయి.

ఈ మేరకు వివిధ సంస్థల సాంకేతిక సామర్థ్యం, నైపుణ్యం, అనుభవం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ క్రమంలో బీఈఎంఎల్‌తోనే ఒప్పందానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 18 నెలల కాలవ్యవధిలో మెట్రోలను తయారు చేసి అందజేసేలా ఈ సంస్థతో ఒప్పందం ఏర్పాటు చేసుకోనున్నారు. ప్రస్తుతం 3 రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు కొత్తగా మరో 10 రైళ్లను కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ దృష్టి సారించింది.  

చార్జీల పెంపుతో సదుపాయాలపై దృష్టి.. 
ప్రయాణికుల రద్దీ మేరకు నాగ్‌పూర్‌ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని మొదట్లో  ప్రతిపాదించారు. కానీ సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత సొంతంగానే కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ కార్యాచరణ చేట్టింది. 2023లోనే ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశారు. భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ సంస్థతో గతంలో సంప్రదింపులు కూడా జరిగాయి. భారీ నష్టాల కారణంగా వెనుకంజ వేశారు. నష్టాలను భర్తీ చేసుకొనేందుకు ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల మెట్రో చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా సదుపాయాలపై తాజాగా దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే  కొత్త రైళ్ల కొనుగోళ్లు కోసం కసరత్తు చేపట్టారు.  

రూ.650 కోట్లకు పైగా వ్యయం.. 
ప్రస్తుతం నాగోల్‌ నుంచి రాయదుర్గం, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కారిడార్‌లలో ప్రతిరోజూ 57 రైళ్లు సుమారు 1,050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అదనపు ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయడం, డిజిటల్‌ సేవల విస్తరణ, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ పెంపు తదితర సేవలపై ఎల్‌అండ్‌టీ దృష్టి సారించింది.

ఇందులో భాగంగానే కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.650 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. ఒక్కో ట్రైన్‌కు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్‌ నడుస్తోంది. కోచ్‌ల సంఖ్యను పెంచడంతో స్టేషన్‌ల మధ్య రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే అదనపు కోచ్‌లకు బదులు కొత్త రైళ్లనే కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

తప్పనిసరి కావడంతో.. 
మరోవైపు రెండో దశ మెట్రో విస్తరణ  దృష్ట్యా కూడా ప్రస్తుతం ఉన్న రూట్లలో రైళ్ల సంఖ్యను పెంచడం అనివార్యం. రెండో దశలో ప్రతిపాదించిన ఐదు కారిడార్‌లలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది. నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో మొదటిదశ మార్గాల్లోనే ప్రయాణికులు రెండో దశ కారిడార్‌లలో రాకపోకలు సాగిస్తారు. ఆ రకంగా కూడా కొత్త రైళ్లు తప్పనిసరి. మొదటి,రెండో దశ మెట్రోల నిర్వహణపై, ప్రయాణికుల సంఖ్య, చార్జీల పంపకాలు, విద్యుత్‌ వినియోగ వ్యయం వంటి అంశాలపైనా ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మధ్య తప్పనిసరిగా ఒప్పందం ఉంటుందని అధికారులు తెలిపారు.

చ‌ద‌వండి: హైడ్రా మ‌రో కీల‌క నిర్ణ‌యం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement