సీసీ కెమెరాలకూ హ్యాకింగ్ ముప్పు!
ఐపీ బేస్డ్ వాటినే టార్గెట్ చేస్తున్న నేరగాళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నిఘా, భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలతో ముప్పు ముంచుకొస్తోంది. ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) బేస్డ్ కెమెరాలను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. వ్యక్తిగత, సున్నిత వీడియోలను సంగ్రహిస్తున్నారు. వీటిని టెలిగ్రాం యాప్‌లో ఉన్న గ్రూపులతోపాటు వివిధ అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. పటిష్ట పాస్‌వర్డ్‌తో పాటు ‘డిజిటల్ హౌస్ కీపింగ్’ ప్రాముఖ్యతల్ని వివరిస్తున్నారు.
గైనకాలజీ ఆస్పత్రిలోని దృశ్యాలు లీక్
రాజ్‌కోట్‌లోని పాయల్ మెటర్నిటీ హోమ్ అక్కడి ప్రముఖ గైనకాలజీ ఆస్పత్రుల్లో ఒకటి. ఆ ఆస్పత్రి నిర్వాహకులు భద్రత, నిఘా, పర్యవేక్షణకు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఐపీ బేస్డ్‌వే కావడంతో డ్యాష్‌బోర్డ్‌కు కనెక్ట్ చేశారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో మహిళలు, యువతులకు వైద్య పరీక్షలు చేస్తున్న, డ్రస్సింగ్ రూమ్, నర్సులకు సంబంఽధించిన కొన్ని వ్యక్తిగత దృశ్యాలతో కూడిన వీడియోలు టెలిగ్రాం గ్రూపులతోపాటు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలోనూ ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆస్పత్రి యాజమాన్యం అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. దీనిని దర్యాప్తు చేసిన అధికారులు ప్రధాన హ్యాకర్ అయిన సూరత్‌కు చెందిన పరీత్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు.
వీక్ పాస్‌వర్డ్ ఆధారంగా హ్యాకింగ్
కంప్యూటర్ పరిజ్ఞానం, హ్యాకింగ్‌లో నైపుణ్యం కలిగిన పరీత్ బ్రూట్ ఫోర్స్ ఎటాక్ విధానంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లతోపాటు ఢిల్లీ, పుణే, ముంబై, నాసిక్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఐపీ బేస్డ్ కెమెరాలకు చెందిన డ్యాష్‌బోర్డులను టార్గెట్ చేశాడు. ఎవరైతే బలహీనమైన పాస్‌వర్డ్స్ లేదా డిఫాల్ట్ పాస్‌వర్డ్స్ కలిగి ఉన్నారో వాటిని ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ డ్యాష్‌బోర్డుల్లోకి చొరబడిన పరీత్ సీసీ కెమెరాల ఫీడ్‌ను తస్కరించాడు. ఈ దృశ్యాలను మరికొందరితో కలిసి టెలిగ్రాం గ్రూపులు, అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. పరీత్ హ్యాక్ చేసిన వాటిలో ఆస్పత్రులు, కార్యాలయాలతోపాటు స్కూళ్లు, షాపింగ్ మాల్స్, కొన్ని గృహాలు సైతం ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇప్పటికీ అనేకం అలాగే...
వ్యక్తిగత, వాణిజ్య అవసరాలకు ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్న వారు వాటి నిర్వహణపై మాత్రం శ్రద్ధ ఉంచట్లేదు. డ్యాష్‌బోర్డులతోపాటు క్లౌడ్‌కు వీక్ లేదా డిఫాల్ట్ పాస్‌వర్డ్స్ వినియోగిస్తున్నారు. పాయల్ మెటర్నిటీ హోమ్ విషయాన్నే తీసుకుంటే వీరికి ఏళ్లుగా ‘అడ్మిన్1234’ అనేదే పాస్‌వర్డ్‌గా ఉంది. సీసీ కెమెరాల వినియోగదారుల్లో అత్యధికులు దీంతోపాటు ‘సీసీకెమెరా1234’, ‘మైకెమెరా1234’, ‘ఏబీసీడీ1234’వంటివే పాస్ట్‌వర్డ్స్‌గా వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కొందరైతే ‘సీసీ కెమెరా’అనే పదాల్లోని అక్షరాలను కుడి నుంచి ఎడమకు మార్చి పాస్‌వర్డ్‌గా వాడుతున్నట్టు వివరిస్తున్నారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ను క్రాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని, బ్రూట్ ఫోర్స్ ఎటాక్ ద్వారా సెక్యూరిటీ వీక్‌గా ఉన్న డ్యాష్‌బోర్డుల్ని తేలిగ్గా గుర్తించొచ్చని స్పష్టం చేస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీతో పాటు డిజిటల్ హౌస్ కీపింగ్
ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలను టార్గెట్ చేసుకొని జరుగుతున్న బ్రూట్‌ఫోర్స్ ఎటాక్స్‌ను తిప్పికొట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చి కనిష్టంగా 12 గరిష్టంగా 16 అక్షరాలు, అంకెలతో కూడినవి ఏర్పాటు చేసుకోవాలి. రూటర్‌లో ఉండే ‘యూపీఎన్‌పీ’ఆప్షన్‌ను ఆఫ్ చేసి ఉంచాలి. కెమెరా పోర్టులను ఇంటర్‌నెట్‌లో ఓపెన్ చేసి ఉంచకూడదు. వీలున్నంత వరకు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారానే రిమోట్ యాక్సస్ చేయాలి. క్లౌడ్‌లో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ యాక్టివేట్ చేయాలి. సైబర్ దాడులకు అరికట్టే సైబర్ సెక్యూరిటీతోపాటు పాస్‌వర్డ్‌ను ఎప్పటిప్పుడు మారుస్తుంటే డిజిటల్ హౌస్‌కీపింగ్ విధానాలను అమలులోకి తేవాలి.
– వీఎన్ తివారీ, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు
వ్యక్తిగత అంశాలు సేకరించి బహిర్గతం
కలకలం సృష్టించిన రాజ్‌కోట్ ఉదంతం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు


