సాక్షి, హైదరాబాద్: రేవంత్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని.. సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయితీ నడుస్తుందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదని.. రేవంత్ రెడ్డి బావమరిదికి బొగ్గుగని కాంటాక్ట్ కట్టబెట్టేందుకే సైట్ విజిట్ విధానం తెచ్చారంటూ మండిపడ్డారు. సింగరేణిలో అతిపెద్ద కుంభకోణం జరుగుతుందని.. దీనిపై కిషన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
‘‘కుంభకోణంపై అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సింగరేణిలో సైట్ విజిట్ విధానం వెంటనే రద్దు చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నా. సింగరేణిలో సమర్థవంతమైన అధికారిని నియమించాలి. బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం ఐఏఎస్ అధికారులను, జర్నలిస్ట్‌లను బలి పశువులను చేశారు. వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టీ వసూలు చేసిన డబ్బుల వాటా పంచాయితీలోనే కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించారు.
‘‘సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వైరం. ముఖ్యమంత్రి, జూపల్లి కృష్ణారావు మధ్య ఆలోగ్రామ్ పంచాయతీతో నిజాయితీ గల ఐఏఎస్ అధికారి బలి అయ్యారు. పెంచిన సినిమా టికెట్ ధరల డబ్బులు పంచుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మధ్య పంచాయితీ. ఖాకీ బుక్ అందరికి ఒకటే అని చెప్పిన డీజీపీ.. ఎందుకు రూల్ బుక్ పాటించడం లేదు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘జర్నలిస్ట్‌లను సజ్జనార్ బెదిరిస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా అని బెదిరించి మాట్లాడావు కదా. ఇప్పుడు ఏమంటావు సజ్జనార్?. ముఖ్యమంత్రి తెలియకుండా సిట్ వస్తే, ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే, నీ గద్దె కూలుతుంది జాగ్రత్త బిడ్డా రేవంత్ రెడ్డి. హులా మాటలు బంద్ చెయ్.. కేబినెట్‌లో రైతు భరోసా ఉసే లేదు. ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిందే రాజీవ్ గాంధీ.
..కాంగ్రెస్ భూస్థాపితం అయినప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది. నైని బ్లాక్ కాంట్రాక్ట్ రద్దు చేశారు సంతోషం. భట్టి విక్రమార్క మీద వచ్చిన వార్తలపై దాని వెనుక ఎవరు ఉన్నారో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. బయట పెట్టకపోతే ముఖ్యమంత్రికి, భట్టి విక్రమార్కకు వాటాల పంచాయతీ సయోధ్య కుదిరినట్లే. జరుగుతున్న కుంభకోణంపై హైకోర్టుకు వెళ్తాం.. సీబీఐకి పిర్యాదు చేస్తాం’’ అని హరీష్‌రావు హెచ్చరించారు.


