సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్‌లలో మున్సిపాలిటీల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు. వీక్‌గా ఉన్న మున్సిపాలిటీలలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
పార్లమెంట్ స్థానాల వారీగా..
భువనగిరి - సీతక్క
ఖమ్మం-కొండా సురేఖ
మహబూబాబాద్- పొన్నం ప్రభాకర్
మల్కాజ్‌గిరి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
చేవెళ్ల-శ్రీధర్‌బాబు
మెదక్-వివేక్
కరీంనగర్-తుమ్మల నాగేశ్వరరావు
పెద్దపల్లి- జూపల్లి కృష్ణారావు
నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్
వరంగల్-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆదిలాబాద్-సుదర్శన్‌రెడ్డి
మహబూబ్‌నగర్- దామోదర రాజనర్సింహ
జహీరాబాద్-అజారుద్దీన్
నాగర్ కర్నూల్- వాకిటి శ్రీహరిలకు బాధ్యతలు అప్పగించారు.
కాగా, త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా మెజారిటీ స్థానాలు దక్కించుకుని తీరుతామని రాష్ట్ర మంత్రివర్గం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగుందని.. బీఆర్‌ఎస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదని కేబినెట్ అభిప్రాయబడింది. ఆదివారం రాత్రి మేడారంలో రెండు గంటలకుపైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఫిబ్రవరి 15లోగా ఎన్నికల పూర్తికి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, పార్టీపరంగా వాటిని ఎదుర్కొనే అంశాలపై మంత్రివర్గం చర్చించింది. జిల్లాలవారీగా, మున్సిపాలిటీలవారీగా రాజకీయ పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై పలువురు మంత్రులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రభావం కారణంగా మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని.. బీఆర్‌ఎస్, బీజేపీ నామమాత్ర పోటీయే ఇవ్వగలుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు.

అయినా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని.. స్థానిక ఎమ్మెల్యేలతోపాటు ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకొని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. చర్చలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే వెలువడనున్నప్పటికీ తన విదేశీ పర్యటన ముందుగానే ఖరారైనందున వెళ్లాల్సి వస్తోందని వివరించారు. కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు తాను విదేశాలకు వెళుతున్నానని.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజలు విశ్వాసం కనబరిచేలా పనిచేసే బాధ్యతను మంత్రులందరూ తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం.


