కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్‌తోపాటు మరికొందరు వేద పండితులు దీక్షా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలుత విశ్వక్సేనునికి పూజ చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా రక్షా కంకణధారణ నిర్వహించారు.
అనంతరం పల్లకీలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు టీటీడీ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మృత్సంగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10 నుంచి 10.30 గంటల్లోపుగా తిరుచ్చి, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో ఊంజల సేవ నిర్వహిస్తారు. ఇదే సమయంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామిపై కీర్తనలు ఆలపించనున్నారు.


