అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్‌లాండ్ అంశంలో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలను ట్రంప్ టార్గెట్ చేశారు. తాజాగా ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలు దేశాల అధినేతలు..
కాగా, ట్రంప్ గ్రీన్‌లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. మాక్రాన్ ట్విట్టర్ వేదికగా..‘ట్రంప్ టారిఫ్‌లు అంటూ ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్‌లాండ్ అయినా, ప్రపంచంలోని మరెక్కడైనా సరే. ఈ తరహా పరిస్థితుల్లో మేం వెనక్కి తగ్గం. టారిఫ్‌ల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదు. ఈ సందర్భంలో వాటికి ఎలాంటి స్థానం లేదు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో టారిఫ్‌లు అమలయ్యే పరిస్థితి వస్తే యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
France is committed to the sovereignty and independence of nations, in Europe and elsewhere. This guides our choices. It underpins our commitment to the United Nations and to its Charter.
It is on this basis that we support, and will continue to support Ukraine…— Emmanuel Macron (@EmmanuelMacron) January 17, 2026
ఫ్రాన్స్ ప్రాధాన్యం అదే..
మరోవైపు.. దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతకు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మాక్రాన్ గుర్తు చేశారు. అదే సూత్రాల ఆధారంగానే ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా ఆ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించడం ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మూలస్తంభమని ఆయన చెప్పారు. ‘యూరప్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం మా నిర్ణయాలకు మార్గదర్శకం. అదే కారణంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాం. శాంతి కోసం, భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. గ్రీన్‌లాండ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్న డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10 శాతం సుంకం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ ఒకటో తేదీకల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు.


