
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు పర్యవేక్షణ బాధ్యత
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న కల్వర్టుల సంఖ్య 940
వీటి వద్ద చెత్త పేరుకుపోకుండా పని చేయనున్న టీమ్స్
అవరసమైన సహకారం అందించనున్న డీఆర్‌ఎఫ్ బృందాలు
ఆదేశాలు జారీ చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సాక్షి, సిటీబ్యూరో: వరద ముంపును సాధ్యమైనంత వరకు తగ్గించడంపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. వీటిలో భాగంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు (ఎంఈటీ) కల్వర్టుల బాధ్యత అప్పగించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఏర్పాటైన ఈ బృందాలను డిజాస్టర్ రెస్పాన్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) సహకరించేలా ఆదేశాలు జారీ చేశారు.
కాంట్రాక్టు విధానంలో 150 బృందాలు..
విపత్తు సమయంలో స్పందించడం, సహాయక చర్యలు అందించడం హైడ్రా అధీనంలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) ప్రధాన విధి. తొలిసారిగా ఎంఈటీల నిర్వహణను సైతం ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. ఈ నేపథ్యంలో గతానికి భిన్నంగా ముందుకు వెళ్తున్న హైడ్రా అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన 150 మాన్సూన్ బృందాల ఎంపిక పూర్తి చేశారు. ఒక్కో మాన్సూన్ టీమ్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒక్కో టీమ్ ఎనిమిది గంటల చొప్పున.. రోజుకు మూడు బృందాలు సిద్ధంగా ఉంటాయి. ఈ బృందాలకు హైడ్రా అదీనంలోని దాదాపు 50 డీఆర్‌ఎఫ్ జట్లు సహకరిస్తాయి. ఈ ఎంఈటీలను 30 మంది మాజీ సైనికోద్యోగులు పర్యవేక్షిస్తున్నారు.
నాలా పరిస్థితి గమనించిన కమిషనర్..
ఈ ఎంఈటీల ఏర్పాటు ప్రతి ఏడాదీ జరుగుతుంటుంది. ఇప్పటి వరకు ఈ బృందాలకు కేవలం వర్షం కురిసినప్పుడు మాత్రమే పని ఉండేది. మిగిలిన సమయంలో నిర్దేశిత ప్రాంతాల్లో వేచి ఉంటుండేవి. మరోపక్క ఇటీవల వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నాలాల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో అవి కబ్జా కావడంతో పాటు కల్వర్టుల వద్ద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోవడం కూడా నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతున్నట్లు గుర్తించారు. కేవలం వర్షం కురిసినప్పుడే కాకుండా ఈ అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించే బాధ్యతల్ని ఎంఈటీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 940 కల్వర్టుల వద్ద ఎంఈటీల పని తీరును సాంకేతికంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.
చదవండి: హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్టులు
ఎస్‌ఎన్‌డీపీ పనులూ పూర్తయ్యేలా...
ఈ ఎంఈటీలు, డీఆర్‌ఎఫ్ బృందాలు తమ పరిధిలో ఉన్న నాలాలతో ప్రధాన ఇంకుడు కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. అవసరమైన వాటిలో పూడిక, పైన పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుంటాయి. ఎంఈటీల పని తీరును ప్రతి వారం హైడ్రా కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు జోరందుకోకుండానే వీలున్నంత వరకు స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌డీపీ) పనులు పూర్తయ్యేలా చూడటం పైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానూ శుక్రవారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొన్ని కూల్చివేతల్ని చేపట్టింది. నాలా విస్తరణకు అడ్డుగా ఉన్న కొన్ని భవనాలను కూల్చేసింది. ఈ తరహాలో అడ్డుగా ఉన్న ఇతర అక్రమ కట్టడాల వ్యవహారాన్నీ ఆరా తీస్తోంది. వీటిలో వాణిజ్య భవనాలపై తక్షణం చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఎంఈటీ, డీఆర్‌ఎఫ్ బృందాలు శుక్రవారం యూసుఫ్‌గూడ, మధురానగర్, కృష్ణానగర్‌లలోని వరద కాలువలో, గచ్చిబౌలిలోని జనార్దన్ రెడ్డి నగర్‌లోని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాయి. కాప్రా సర్కిల్ వార్డు నెం.2 మార్కండేయ కాలనీలో నాలా క్యాచ్‌పిట్ ఏరియాను శుభ్రం చేశాయి. ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలో ఆర్‌సీఐ రోడ్డు, మిథిలానగర్ సమీపంలోని మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చెరువుకు వెళ్లే నాలాలోని పూడికను జేసీబీతో తొలగించాయి.
03.07.25 గురువారం నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పర్యటించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు.#HYDRAA pic.twitter.com/hnl9TCZ5M2
— HYDRAA (@Comm_HYDRAA) July 4, 2025