విలీనంతో బాధ్యత మరింత పెరిగింది
సాక్షి, సిటీబ్యూరో: 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో కలిపి నగరాన్ని మహా హైదరాబాద్‌గా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ చారిత్రక నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. విలీనంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేశంలోనే అతిపెద్ద మహానగరానికి మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా ఉండడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను వారు ఆవిష్కరించిన అనంతరం కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులర్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఫౌంటైన్, సుందరీకరణ పనులకు సైతం మేయర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలో పురపాలికల విలీనంపై మేయర్ స్పందిస్తూ.. 27 పురపాలికల విలీన నిర్ణయంతో బల్దియా 650 చ.కి.మీ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధి 2000 చ.కి.మీ వరకు విస్తరించిందన్నారు. తద్వారా హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిందన్నారు. జీహెచ్‌ఎంసీలో పురపాలికలు భాగం కావడం వల్ల హైదరాబాద్‌తో సమానంగా విలీన పురపాలికలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్
గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ
కొణిజేటి రోశయ్యకు ఘనంగా నివాళి
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రోశయ్య అజాత శత్రువని, ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు.


