రాత్రి 11 గంటలకు తగ్గింపు
రేపటి నుంచే అమలులోకి..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ వేళలను కుదించారు. ఇప్పటి వరకు టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11.45 గంటలకు ఆఖరు మెట్రో సర్వీసు బయలుదేరుతుండగా సోమవారం నుంచి రాత్రి 11 గంటలకే చివరి మెట్రో సర్వీసు బయలుదేరనుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
మారనున్న వేళల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోని ఎల్‌బీనగర్, నాగోల్, అమీర్‌పేట్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్ స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి 11 నుంచి 11.45 గంటల వరకు ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతోనే 45 నిమిషాల వ్యవధిలో నడిపే సర్వీసులను తగ్గించినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు పేర్కొన్నాయి.


