న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో కూడా భద్రతను పెంచారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోని అన్ని రైల్వే స్టేషన్లకు కూడా హై అలర్ట్ ప్రకటించారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన భారీ పేలుడులో 10 మంది మరణించగా, 24 మంది గాయపడ్దారు. ఈ నేపధ్యంలో భద్రతా సంస్థలు దేశ రాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ)విమానాశ్రయంతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోని మెట్రో, రైల్వే స్టేషన్లకు హై అలర్ట్ ప్రకటించారు.
ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో..
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో జరిగిన పేలుడు నేపధ్యంలో ఢిల్లీతోపాటు పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ , హర్యానాలలో తక్షణ హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాల్లో నిఘా పెంచడంతోపాటు భద్రతా తనిఖీలను ముమ్మరం చేశాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) ప్రత్యేక బృందాలతో పాటు ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు స్వభావాన్ని గుర్తించేందుకు ఆధారాలను పరిశీలిస్తున్నారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) ఢిల్లీలోని అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భద్రతను అందిస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పేలుళ్ల తర్వాత న్యూఢిల్లీ, పాత ఢిల్లీతో సహా చుట్టుపక్కల ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లను హై అలర్ట్‌లో ఉంచారు. ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బృందాలతో పాటు డాగ్ స్క్వాడ్‌లను అన్ని స్టేషన్లలో మోహరించి, తనిఖీలు, నిఘాను ముమ్మరం చేశారు. అయితే రైలు సర్వీసులను నిలిపివేయలేదని షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరిగిన పేలుడు దేశంలో భయాందోళనలు రేకెత్తించింది. దీంతో కోల్‌కతా, డెహ్రాడూన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్‌కతాలో పోలీసులు నగరం అంతటా ముమ్మర తనిఖీలను ప్రారంభించారు. హర్యానాలో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా అధికారులను.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఉంచాలని, చారిత్రక ప్రదేశాలలో పర్యవేక్షణను పెంచాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా పోలీసులను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రదేశాలలో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత భద్రతా చర్యలు గణనీయంగా పెంచామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా మీడియాకు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్, దాదర్, థానే, కళ్యాణ్ వంటి కీలక స్టేషన్లలో గస్తీని పెంచారు. డాగ్ స్క్వాడ్‌లు, బాంబు నిర్వీర్య బృందాలు అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేస్తున్నాయి. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులను తాకకుండా ఉండాలని అధికారులు సూచించారు.


