గడువులోగా మెట్రో స్వాధీనం | Govt to Take Over Metro From L&T by March 2026 | Sakshi
Sakshi News home page

గడువులోగా మెట్రో స్వాధీనం

Dec 23 2025 8:19 AM | Updated on Dec 23 2025 8:19 AM

Govt to Take Over Metro From L&T by March 2026

మార్చి 31 నాటికి ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో స్వాదీనం 

తుది దశలో పాతబస్తీ మెట్రో రోడ్ల విస్తరణ 

కేంద్రం అనుమతితో ఒకేసారి రెండో దశ పనులు  ప్రారంభం 

 ‘సాక్షి’తో హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌  

సాక్షి,  హైదరాబాద్‌: నిరీ్ణత గడువులోగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కార్యాచరణను వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీలు, న్యాయపరమైన అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన  ఐడీబీఐ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. మరోవైపు  మెట్రో రైళ్ల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలపైన అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు త్వరలో టెక్నికల్‌ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. 

మెట్రో స్వా«దీనప్రక్రియ పురోగతిపై మెట్రో రైల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌  ‘సాక్షి’తో ముచ్చటించారు. మరో వారం పది రోజుల్లో టెక్నికల్‌ కన్సల్టెన్సీ నియామకం పూర్తవుతుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం కియోలిస్‌ సంస్థ ఆధ్వర్యంలోనే మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. డ్రైవర్లు, సాంకేతిక సిబ్బంది, రైళ్ల నిర్వహణ తదితర అంశాలను కియోలిస్‌ పర్యవేక్షిస్తోంది. మరో ఏడాది పాటు ఈ సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంది. కానీ మొదటిదశతో పాటు భవిష్యత్తులో నిర్మించనున్న రెండో దశ మెట్రో కూడా పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగా అవతరించనున్న దృష్ట్యా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మొత్తం రైళ్ల నిర్వహణపై ఈ సాంకేతిక అధ్యయనం దిశా నిర్దేశం చేయనుందని ఎండీ  చెప్పారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రో మొదటి దశ నుంచి వైదొలగనున్నట్లు ఎల్‌అండ్‌టీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి  తెలిసిందే. అనంతరం ప్రభుత్వం కూడా మొదటి దశను స్వా«దీనం చేసుకునేందుకు సన్నద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీకి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కూడా  ఏర్పాటైంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా చీఫ్‌ సెక్రెటరీ నేతృత్వంలో మెట్రో స్వా«దీన కమిటీ పని చేస్తోందని ఆయన వివరించారు.  

భూములు, భవనాలు స్వాదీనం... 
ఒప్పందానికి అనుగుణంగా మెట్రో మొదటి దశలో భాగంగా  రవాణా ఆధారిత అభివృద్ధి కోసం  ఎల్‌అండ్‌టీకి అప్పగించిన  భూములు, భవనాలు, మాల్స్‌ను త్వరలో  స్వాధీనం చేసుకోనున్నట్లు  పేర్కొన్నారు.ప్రస్తుతం  212  ఎకరాల  భూములు  అందుబాటులో ఉన్నాయన్నారు.అలాగే మూడు కారిడార్‌లలోని  మాల్స్, ఇతర ఆస్తులను  విక్రయించడం  ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని  భావిస్తున్నట్లు చెప్పారు.

ఒప్పందం  మేరకు  ఎల్‌అండ్‌టీ సంస్థకు ప్రభుత్వం  రూ.2000 కోట్లు అందజేయవలసి ఉంది.అలాగే  బ్యాంకుల్లో ఉన్న  మరో రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఎల్‌అండ్‌టీ నుంచి స్వా«దీనం చేసుకోనున్న ఆస్తులు, భూముల విక్రయాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కియోలిస్‌ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రో రైళ్లనిర్వహణను అదే సంస్థతో యథావిధిగా కొనసాగించినా, లేదా మరో సంస్థను ఎంపిక చేసినా అందుకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేయవలసి ఉంటుంది. అలాగే ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోచ్‌ల కొనుగోలు అంశం కూడా ప్రతిపాదనలో ఉంది.

సకాలంలో రెండో దశ..
మెట్రో రెండో దశకు కేంద్రం సానుకూలంగా ఉందని, సకాలంలోనే అన్ని కారిడార్‌లలో ఒకేసారి పనులను చేపట్టే అవకాశం ఉందని ఎండీ తెలిపారు. గతంలో కేంద్రానికి అందజేసిన డీపీఆర్‌ల ఆధారంగానే రెండో దశ ప్రాజెక్టుపైన ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వమే స్వాదీనం చేసుకుంటున్నందు వల్ల రెండో దశ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పరిధిలో రోడ్డు విస్తరణ  కోసం చేపట్టిన ఆస్తుల సేకరణ దాదాపుగా పూర్తయినట్లు ఎండీ చెప్పారు. మొత్తం 880  నిర్మాణాలను గుర్తించగా, ఇప్పటి వరకు సుమారు 700 ఆస్తులను సేకరించి కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రెండో దశలో ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు నిరి్మంచనున్న కారిడార్‌లో కూడా భూసేకరణ చేపట్టవలసి ఉందని, మిగతా కారిడార్‌లలో పెద్దగా భూసేకరణ అవసరం లేకుండానే రెండో దశ  ప్రాజెక్టును నిరి్మంచబోతున్నామని సర్ఫరాజ్‌ అహ్మద్‌  వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement