గప్‘చిప్’ దోపిడీ!
ఎలక్ట్రానిక్ కాంటాల్లో ‘రిమోట్’ కంట్రోల్
ఇప్పటి వరకు పెట్రోల్ బంకుల్లోని ఫ్యూయల్ డిస్పెన్సింగ్ యంత్రాల్లో స్మార్ట్, ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చి రిమోట్‌తో తూకం కొలతలను కంట్రోల్ చేస్తుండగా.. తాజాగా పండ్ల, చేపల మార్కెట్‌లలో కొందరు వ్యాపారులు ఎలక్ట్రానిక్ డిజిటల్ తూకంలో సైతం సరికొత్త రిమోట్ విధానం అవలంబిస్తున్నారు. మార్కెట్లలో చిన్న ఎలక్ట్రానిక్ కాంటా నుంచి వేయింగ్ యంత్రాల వరకు తూకంలో కనీసం 50 గ్రాముల నుంచి 10 కేజీల వరకు తూకంలో వ్యత్యాసం వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: వినియోగదారులు తప్పుడు తూకంతో నిత్యం నిలువు దోపిడికి గురై మోసపోతూనే ఉన్నారు. సాధారణంగా వీధిలో గల చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో కళ్ల ముందు కనిపించే రీడింగ్ డిస్‌ప్లే చూసి అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఇక్కడే కనిపించని మోసానికి గురికాక తప్పడం లేదు. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా తక్కువ తూకం అందించి దోచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే ఆప్షన్లు మార్చే విధానాన్ని ప్రయోగించిన అక్రమ బడా వ్యాపారులు తాజాగా చేతివాటం బయట పడకుండా సరికొత్త రిమోట్ కంట్రోల్ మోసానికి తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.
మదర్‌బోర్డులో చిప్స్ అమర్చి
ఎలక్ట్రానికి కాంటాల మదర్ బోర్డులో చిప్‌లను ఏర్పాటు చేయించి రిమోట్ ద్వారా తూకం బరువును హెచ్చు తగ్గులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుడికి అనుమానం వచ్చి బరువు పెట్టి పరిశీలించినా తూకం మోసం బయట పడకుండా రిమోట్‌తో బరువును మెయింటెన్ చేస్తున్నారనే ఆరోపణలు వినివస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి కేంద్రంగా ఒక ముఠా అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక చిప్‌లు దిగుమతి చేసుకొని ఎలక్ట్రానికి డిజిటల్ వేయింగ్ మిషన్ మదర్‌బోర్డులో చిప్‌లు అమర్చి డిస్‌ప్లే మీటర్‌ను రిమోట్‌తో కంటోల్ చేసేలా ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పండ్ల, చేపల మార్కెట్ వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపరింగ్ చేసుకొని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి కిలోకు 100– 150 గ్రాములు ఎక్కువగా..
ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ కాంటాపై పది కిలోల బరువు గల బాట్ వేసి తూకం పెట్టి పరిశీలిస్తే..11 కిలోల డిస్‌ప్లే అయ్యేది. వాస్తవంగా ఎలక్ట్రానిక్, డిజిటల్‌లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేసేవారు.. ఉదాహరణకు ఆ ఆప్షన్‌న్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషనన్‌పై 850 నుంచి 900 గ్రాముల బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్‌ప్లే అవుతోంది. అదే మిషన్‌పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి 1150 గ్రాములు డిస్‌ప్లే అవుతోంది. అంటే ప్రతి కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు చేతివాటానికి పాల్పడుతున్నారన్నమాట. 5 కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెర వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. వినియోగదారులకు అనుమానం వచ్చి సమాన బరువు పెట్టి పరిశీలిస్తే మాత్రం ఎక్కువ బరువు డిస్‌ప్లేపై కనిపించి చేతివాటం బయటపడుతుండటంతో రిమోట్ మోసానికి తెర లేపినట్లు అవగతమవుతోంది. ఈ విషయంపై తూనికలు, కొలతల అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
ప్రెటో బంకుల తరహాలో డిజిటల్ మదర్‌బోర్టులో ప్రత్యేక చిప్
మార్కెట్లలో చిన్న ఎలక్ట్రానిక్ డిజిటల్ త్రాసు నుంచి వేయింగ్ మిషన్ వరకు
50 గ్రాముల నుంచి 10 కేజీల వరకు తూకం మోసాలు
అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక చిప్‌ల దిగుమతి
బాచుపల్లి కేంద్రంగా ఎలక్ట్రానిక్ త్రాసుల ట్యాంపరింగ్


