అద్వితీయ నృత్యం ‘కాకతీయం’
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
గన్‌ఫౌండ్రీ: కూచిపూడి, ఒడిస్సీ మాదిరిగా తెలంగాణకే ప్రత్యేకమైన నృత్యం కాకతీయం అని, త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి గత పదేళ్లుగా వరంగల్ సమీప దేవాలయాల్లో, రామప్ప గుడిలో శిలాశాసనాలు, శిల్పాలు, వివిధ నృత్య గ్రంథాలు, జయాపసేనాని రచించిన నృత్య రత్నావళిని పరిశీలించి, పరిశోధించి రూపొందించిన ‘కాకతీయం తెలంగాణ నాట్యం’ గ్రంథాన్ని భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా ఆవిష్కరించి ప్రసంగించారు. కాకతీయుల కాలం నాటి చరిత్రను పరిశోధించి ఒక శాసీ్త్రయ నృత్య సంపదను వెలుగులోకి తీసుకురావడం గర్వకారణమని ఆయన కొనియాడారు. అలాగే ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, నాట్య గురువు పద్మజారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్‌రెడ్డి, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు, పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.ఆచార్య తదితరులు పాల్గొన్నారు.


