సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మార్గాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి (టీఓడీ)కి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణా సదుపాయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా టీఓడీ ప్రాజెక్టులకు ప్రత్యేక అనుమతులనివ్వనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ ‘హుమ్టా’ ఆధ్వర్యంలో విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. నివాస, వాణిజ్య భవన సముదాయాలు ఒకే ఆవరణలో అందుబాటులో ఉండేలా బహుళ వినియోగ భవనాలను నిర్మించనున్నారు. మెట్రో కారిడార్‌లకు రెండు వైపులా 500 మీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాల్లో ఈ తరహా భవనాల నిర్మాణాలను ప్రోత్సహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 8 కారిడార్లలో టీఓడీ ప్రాజెక్టులు..
మెట్రో మొదటి దశలోని మూడు కారిడార్‌లతో పాటు రెండో దశలో నిర్మించనున్న మొదటి ఐదు కారిడార్‌లలో టీఓడీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. సుమారు 200 కి.మీ. మార్గంలో అవకాశం ఉన్నచోట నిర్మాణాలను చేపట్టాలనేది ప్రతిపాదన. ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వ స్థలాలను లీజు ప్రాతిపదికన తిరిగి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమా? లేక.. వాటిని విక్రయించడం ద్వారా మెట్రో నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చడమా? అనే అంశాలపై త్వరలో స్పష్టత రానుందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే మెట్రోస్టేషన్‌లకు రెండు వైపులా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో టీఓడీ ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నారు. టీఓడీ అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది. వివిధ నగరాల్లో ఇప్పటికే చేపట్టిన టీఓడీ ప్రాజెక్టులను అధ్యయనం చేస్తున్నాం. త్వరలోనే స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసే అవకాశం ఉంది’ అని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు.
కర్కర్‌దూమా మెట్రో టీఓడీ తరహాలో..
ప్రస్తుతం ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) కర్కర్‌దుమా మెట్రోస్టేషన్ వద్ద ఈ టీఓడీ ప్రాజెక్టును చేపట్టింది. మిక్స్‌డ్ అర్బన్ డెవలప్‌మెంట్ భవనంగా సుమారు 48 అంతస్థులను నిర్మించనున్నారు. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా 1026 డబుల్ బెడ్రూంలతో ఈ టవర్ 2026 జూలై నాటికి అందుబాటులోకి రానుంది. ఒక్కో ఫ్లాట్ ధర కనిష్టంగా రూ.1.79 కోట్ల నుంచి గరిష్టంగా రూ.2.48 కోట్ల వరకు ఉంటుంది. ఇదే తరహాలో హైదరాబాద్‌లో అవకాశం ఉన్న మెట్రోస్టేషన్‌ల వద్ద అన్ని సదుపాయాలతో టవర్‌లను నిర్మించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


