శబరిమల అయ్యప్ప బంగారు అభరణాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శబరిమల ప్రధాన ధ్వజస్తంభంతో పాటు ఇతర విగ్రహాలకు సంబంధించిన బంగారం అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పి.ఎస్ ప్రశాంత్ ను అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.
శబరిమల బంగారు అభరణాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇదివరకే ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరుతో, ఉన్నిక్రిష్ణన్ పొట్టితో సహా ఇతరులను సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆలయ బంగారు అభరణాల పూత కేసులో మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు.
సిట్ అధికారులు జరిపిన విచారణలో ఆలయ ధ్వజస్తంభం నుంచి కూడా బంగారం చోరీకి గురయిందని అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధ్వజస్తంభానికి ఉన్న లోహాన్ని తిరిగి వినియోగించాలి. అయితే జెండా స్తంభానికి ఉన్న బంగారం, వాజివాహనం(గుర్రం) వంటి ఇతర విగ్రహాలతో కూడిన రిజిస్టర్ ప్రస్తుతం కనిపించడం లేదని అధికారులు తెలిపారు.
అయితే 2019లో శబరిమల గోల్డ్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే తిరిగి 2025లో బంగారు పలకాల పూత కాంట్రాక్టు అప్పగించడంపై దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడి తీరుపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు విచారించగా తిరిగి మరోసారి దర్యాప్తుకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


