మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్ర(ఫైల్ ఫొటో)
శబరిమల ఆలయం బంగారం దొంగతనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీపీఎం నేత, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ డైరెక్టర్ పద్మకుమార్ ఈ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో దేవస్వం(దేవాదాయ శాఖ)మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రను విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేరళనాట తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
శబరిమల గర్భగుడి శిల్పాలకు బంగారు పూత వేయడానికి వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి స్పాన్సర్‌గా ముందుకు వచ్చారని.. ఈ ప్రతిపాదన ఆనాటి దేవస్వం మంత్రికి కూడా తెలిసిందని.. సురేంద్రన్ కూడా లేఖ ద్వారా ఆసక్తి వ్యక్తం చేశారని పద్మకుమార్ వాంగ్మూలంలో ఉంది. ఈ వాంగ్మూలం ఆధారంగా సురేంద్రన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే.. పద్మకుమార్ విచారణ పూర్తైన తర్వాతే ఏదనే నిర్ణయం తీసుకుంటామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
పూజారి నుంచి వ్యాపారవేత్తగా మారిన ఉన్నికృష్ణన్ పొట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 1998లో బంగారు పూత వేసిన ద్వారపాలక శిల్పాలపై తిరిగి పనులు చేయడానికి పొట్టికి అనుమతి ఇచ్చిన సమయంలోనే బంగారం చోరీ జరిగినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో పొట్టి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని.. ఆ చొరవ వల్లే ఆయనకు ప్రత్యేక అనుకూలత లభించిందని, చోరీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఇప్పటిదాకా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నికృష్ణన్ పొట్టి తోపాటు మురారి బాబు (మాజీ దేవస్థానం బోర్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), డీ సుధీశ్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఎన్. వాసు (మాజీ దేవస్థానం కమిషనర్, అధ్యక్షుడు) అరెస్ట్ అయ్యారు. వాసు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గురువారం నాలుగు గంటలపాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ను విచారించి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Watch: In the Sabarimala gold theft case, former Travancore Devaswom Board president A. Padmakumar has been arrested by the SIT. The arrest was recorded after he was questioned at the State Police Headquarters. Padmakumar was the Devaswom Board president in 2019, when the gold… pic.twitter.com/4wVDWqrANy
— Jist (@jist_news) November 20, 2025
అయితే.. విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ అధికార పక్షం నేతల పేర్లు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. సీపీఎం నేతలైన దేవస్వం కమిషనర్ ఎన్. వాసు, తరువాత ఎ. పద్మకుమార్ అరెస్టు కావడం.. ఇప్పుడు మాజీ మంత్రి పేరు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేతల పాత్రలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం పినరయి విజయన్ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కోరుతున్నారు.
పొట్టి వెనుక భారీ శక్తులుండొచ్చు: హైకోర్టు
శబరిమల బంగారం దోపిడీ కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయనే అనుమానం వ్యక్తంచేసింది. దర్యాప్తును వేగవంతం చేయాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని హైకోర్టు నిర్ణయించింది.


