తిరువనంతపురం: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ, కర్ణాటక, తమిళాడులో ఈడీ అధికారులు దాడులు చేశారు. దేవస్యం బోర్డు మాజీ సభ్యుడి ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించారు.
శబరిమల బంగారు దొంగతనం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలయంలోని గర్భగుడి వెలుపల ఉన్న బంగారు పూత పలకలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ అధికారుల దర్యాప్తులో నిందితులు బంగారు పలకలను తొలగించి, వాటిని అక్రమంగా విక్రయించినట్లు తేలింది. ఆర్థిక లావాదేవీలలో అనుమానాస్పద అంశాలు బయటపడటంతో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు.
మంగళవారం ఉదయం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. నిందితుల నివాసాలు, వ్యాపార సంస్థలు, అలాగే సంబంధిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నిందితులు పలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆధారాలు బయటపడ్డాయి.
శబరిమల బంగారం చోరీ కేసులో కొల్లం విజిలెన్స్ కోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగారం చోరీ కేసులో సిట్ దర్యాప్తు పత్రాలను ఈడీకి అందించాలని సూచించింది. దీంతో రెండు సంస్థలు కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. సిట్ ఇప్పటికే నిందితులను గుర్తించి కేసు నమోదు చేసింది. ఈడీ కూడా అదే నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.


