కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవమా లేక కీలకమైన మిత్రుడిని కోల్పోవడమా అనే ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్ ముందుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇది అత్యంత కష్ట కాలమని ఆయన తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు చాలా కష్టమైన ఎంపికను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివల్ల గౌరవాన్ని కోల్పోవడం లేదా కీలక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దురాక్రమణను ఆపాలంటే కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌ను రష్యాకు వదిలివేయడం వంటి షరతులు ట్రంప్ ప్రతిపాదనల్లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ ప్రసంగం చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్‌స్కీ ప్రభుత్వానికి అందించారు. ఆ ప్లాన్ ప్రకారం.. ఉక్రెయిన్ తూర్పు డాన్‌బాస్‌లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఎవరూ అందించకూడదు.


