వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు కొంత అనుకూలంగా ఉంటూ.. ఉక్రెయిన్‌కు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జెలెన్‌స్కీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమెరికా 28 అంశాల ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ విషయంలో ఇది తన తుది ప్రతిపాదన కాదన్నారు. ఒకవేళ జెలెన్‌స్కీ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, ఆయన చివరి వరకు పోరాటం కొనసాగించవచ్చు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని అన్నారు. తాను 2022లో అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో నవంబర్ 27లోగా అంగీకరించాలంటూ ఉక్రెయిన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇక, ఈ ప్రణాళికలో చాలా మార్పులు అవసరమని ఉక్రెయిన్ మిత్రదేశాల కూటమి జెలెన్‌స్కీకి తేల్చిచెప్పింది.
Reporter “Is this your final offer to Ukraine”
Trump: “No”
Even Donald Trump he knows he went to far, he knows his treachery was too obvious.
Even the doubters can see he is a Russian asset now and he’s risked his own presidency with what he has done. pic.twitter.com/xIXmWpTy5e— Bricktop_NAFO (@Bricktop_NAFO) November 22, 2025
ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రణాళికపై మరో తీవ్రమైన ఆరోపణ బయటకు వచ్చింది. 28 పాయింట్లు ఉన్న ఈ పత్రం వాస్తవానికి రష్యా నుంచి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనేటర్లకు చెప్పినట్లు రిపబ్లికన్ సెనేటర్ మైక్ రౌండ్స్ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. దీంతో, ఈ ప్రతిపాదనకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.
జెలెన్‌స్కీ ఆందోళన..
మరోవైపు.. ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్ భావిస్తోంది. అంగీకరిస్తే దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒప్పుకోకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అమెరికాతో స్నేహాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంతో.. ఆ దేశ జెలెన్‌స్కీ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది. అదే సమయంలో రాజకీయంగా, సైనికపరంగా కూడా ఆయన తీవ్ర ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు.
ట్రంప్ శాంతి ప్రణాళిక..
ఈ శాంతి ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఆరు లక్షలకు కుదించుకోవాలి. నాటోలోకి ఉక్రెయిన్ ఎప్పటికీ చేరకూడదు. అన్నింటికంటే కీలకం.. క్రిమియా, డాన్‌బాస్, లుహాన్స్క్‌తో పాటు.. ఖేర్సన్‌లో, జపోరిజియాలలో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలి. ఈ ప్రతిపాదనను జెలెన్‌స్కీ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయినా ఒప్పందంలో భూభాగాల అప్పగింత ప్రతిపాదనను ట్రంప్ చేయడం గమనార్హం.
యుద్ధంలోనూ ఎదురుదెబ్బలు
యుద్ధక్షేత్రంలోనూ ఉక్రెయిన్‌కు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. చాలా ప్రాంతాల్లో ఆ దేశ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రష్యా నెమ్మదిగా కీలక ప్రాంతాలను ఆక్రమిస్తోంది. దొనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాల్లో ముందుకు కదులుతోంది. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారీస్థాయిలో దాడులు చేస్తోంది. ఆయుధాల కొరత కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. అమెరికా, ఇతర ఐరోపా దేశాల నుంచి సరఫరాలు అనుకున్నంత వేగంగా ఆ దేశానికి చేరడం లేదు. మానవ వనరుల కొరత కూడా వేధిస్తోంది. కొత్తగా సైన్యంలోకి ఎవరూ చేరడానికి ముందుకు రావడం లేదు. దీంతో సైన్యం నైతిక స్థైర్యమూ దెబ్బతింటోంది.


